సాధారణంగా రీల్ లైఫ్ లో హీరోలు రియల్ లైఫ్ లో కూడా హీరో కావాలని లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా హీరోగా మంచి పేరును సొంతం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసిన చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీస్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.
తాజాగా నటుడు రాజా రవీంద్ర చిరంజీవి హేమకు చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చారు. మనలో చాలామంది బ్లడ్ బ్యాంకే కదా అని అనుకుంటామని అయితే ఆ బ్లడ్ బ్యాంక్ తో చిరంజీవి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాడని రాజా రవీంద్ర తెలిపారు. ప్రముఖ సినీ నటి హేమ బ్లడ్ గ్రూప్ ఓ నెగెటివ్ అని హేమ డెలివరీ సమయంలో రక్తం అవసరం కాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అందడంతో ఆమె బ్రతికిందని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.
అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే రక్తం విలువ తెలుస్తుందని బ్లడ్ బ్యాంకును నడపటానికి నెలకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతుందని రాజా రవీంద్ర తెలిపారు. గతంలో హేమ ఒక సందర్భంలో తనకు ప్రాణాపాయ స్థితి ఏర్పడితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకుందని చెప్పిన సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కూడా చిరంజీవి కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నారు. ఎంతోమందికి సహాయం చేసినా ఆ సహాయాలను చెప్పుకోవడానికి మాత్రం చిరంజీవి ఇష్టపడరు.