‘నో’ చెప్పినవాడితో ‘ఎస్’ చెప్పించుకోవడంలో ఉండే కిక్ మామూలుగా ఉండదు అంటుంటారు. నిజ జీవితంలో ఇలాంటి సందర్భం ఎప్పుడో ఒకసారి మీరూ ఫేస్ చేసే ఉంటారు. అన్ని రంగాల్లోనూ ఈ లాజిక్ బాగా ఉంటుంది. ఫలానా పని చేస్తుంటే… స్థాయి అనే మాట వాడి ఇబ్బంది పెట్టేవాడికి సరైన సమాధానం… మనం ఆ స్థాయికి చేరి చూపిచండమే అంటుంటారు పెద్దలు. అలాంటి పనే చేసింది ప్రముఖ నటి హేమ. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన హేమ… ఆ తర్వాత బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది.
ఈ క్రమంలో ఆమె తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు చెప్పండి. ఈ విషయంలో ‘అవునా?’ అనే ప్రశ్నకే తావు లేదు. కారణం సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసేవారి విషయంలో కొంతమందికి చిన్న మనస్తత్వం ఉండటమే. ఆ మాటకొస్తే ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుంది. అలా హేమ నటిగా మారిన తొలినాళ్లలో ఇలాంటి అవమానాలు చాలానే ఎదుర్కొన్నారట. ఈ మధ్య వాటి గురించి మాట్లాడారు. తన తొలినాళ్లలో జరిగిన విషయాలు, అవి తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లిన విషయం గురించి చెప్పుకొచ్చారు హేమ.
‘భారతనారి’ అనే సినిమాలో హేమ ఓ చిన్న పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఆమెను ఇబ్బంది పెట్టే ఘటన జరిగిందట. లంచ్ టైమ్‌లో డైరక్టర్, యాక్టర్స్ అందరూ కలసి కూర్చొని తింటున్నారట. హేమ కూడా వారితోపాటే కూర్చుని తింటున్నారట. ఇంతలో ఓ ప్రొడక్షన్ బాయ్ వచ్చి… ‘ఇక్కడ కూర్చున్నావేంటి… అక్కడికి వెళ్లి తిను’ అని గట్టిగా అన్నాడట. ఆ మాటకు హేమకు చాలా కోపం వచ్చిందట. తింటున్న టేబుల్ ఎత్తి పడేద్దాం అనుకుందట.
కానీ అలా చేయకుండా… అందరితో కలసి తినే రోజు రావాలని చాలా కష్టపడి మంచి మంచి పాత్రలు చేసి వచ్చిందట. ఆ రోజు ప్రొడక్షన్ బాయ్ చేసిన పని తనలో కసిని రగల్చిందని చెబుతున్నారు హేమ. ఆ తర్వాత కొన్ని రోజులకు పెద్ద నటి అయ్యాక అదే ప్రొడక్షన్ బాయ్ వచ్చి… ఎంతో మర్యాదగా తనకు వడ్డించాడని చెప్పుకొచ్చారు హేమ. ఇప్పుడు అర్థమైందిగా కాదన్నచోట తనేంటో నిరూపించుకుంటే అంతకుమించిన విజయం మరొకటి లేదు.