Krithi Shetty: తెలుగులో హిట్లు లేవు.. తమిళంలో వరుస ఛాన్స్‌లు.. కృతి కిర్రాక్‌!

తొలి సినిమాతో వచ్చి పేరును నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏకంగా ఆ సినిమాలో పాత్ర పేరును తన పేరుగా మార్చుకున్న కథానాయికలకు అయితే ఇది ఇంకా కష్టం. ఇలాంటి పరిస్థితిని హ్యాండిల్‌ చేయలేక వరుస ఫ్లాప్‌లు మూటగట్టుకుంటున్న కథానాయిక కృతి శెట్టి (Krithi Shetty) . ‘ఉప్పెన’  (Uppena) సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన కృతి.. ఆ సినిమా ఇచ్చిన ఫేమ్‌తో వరుస సినిమాలు చేసింది. అయితే విజయాల శాతం తక్కువే. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌కి వెళ్లిన ఈ భామ అక్కడ ఇప్పుడు వరుస ఛాన్స్‌లు సంపాదిస్తోంది.

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా తమిళ సీమలో కృతికి ఛాన్స్‌లు సంపాదిస్తోంది. ఇప్పుడు ఆమె చేతిలో మూడు సినిమాలు ఉండగా.. మరో సినిమాకు ఓకే చెప్పింది అని అంటున్నారు. జ‌యం ర‌వి కొత్త సినిమా ‘జీనీ’లో కృతినే కథానాయిక. ఫాంట‌సీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇంకా పూర్తవ్వకుండానే ఆమెకు ‘ల‌వ్ టుడే’ (Love Today) ఫేమ్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌ (Pradeep Ranganathan) సినిమా ‘ఎల్‌ఐసీ – లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్’లో ఛాన్స్‌ వచ్చింది. దీంతో ఫుల్‌ జోష్‌లో కనిపించింది.

ఈ సమయంలో తెలుగులో చేసిన ‘మనమే’ (Manamey) ఫలితం తేడా కొట్టేయడంతో నిరాశపడింది. అయితే ఈ లోపు కార్తి కొత్త సినిమా ఛాన్స్‌ సంపాదించింది. ఈ క్రమంలో కోలీవుడ్‌లోనే ఉండిపోతుందేమో అని అనుకుంటుండగా.. మరో తమిళ సినిమా ఓకే చేసి షాకిచ్చింది. మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) స‌ర‌స‌న కృతి ఓ సినిమాలో న‌టించ‌బోతోందని భోగట్టా. సెల్వ‌మ‌ణి సెల్వ‌రాజ్ అనే యువ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

అలా అని ఇది పూర్తిగా తమిళ సినిమానా అంటే కాదు అని అంటున్నారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తారట. ఈ సినిమాలో రానా నిర్మాణ భాగ‌స్వామి అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. నేరుగా తెలుగు సినిమాలు చేసి పరాజయాలు అందుకుంటున్న కృతికి ఈ బైలింగ్వుల్‌ సినిమా ఏమన్నా మార్పు తీసుకొస్తుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus