అజ్ఞాతవాసి అంచనాలు తలకిందులయ్యాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను సైతం ఆకట్టుకోక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అత్యధిక రేట్లతో ఈ సినిమాని కొన్న వారు నష్టాలను చవిచూశారు. వారి నష్టాలను పూడ్చడానికి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లు తమ రెమ్యూనరేషన్లో కొత్త భాగాన్ని తిరిగి ఇచ్చేసేందుకు ముందుకువచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అజ్ఞాతవాసికి మరో పెద్ద ముప్పు పొంచి ఉంది. ఏ సమయంలోనైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి “లార్గోవించ్” సినిమా డైరక్టర్ జెరోమ్ సలే సిద్ధంగా ఉన్నారు. మొదటి నుంచి అజ్ఞాతవాసి కథ ఫ్రెంచ్ సినిమాకి కాపీ అని మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని డైరక్టర్ జెరోమ్ సలే చూసి మొదటి రోజే ట్వీట్ చేశారు.
తన సినిమా మాదిరిగానే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక దీని గురించి డైరక్టర్ పట్టించుకోరని భావించారు. కానీ లేటెస్ట్ గా అతను చేసిన ట్వీట్ అజ్ఞాతవాసి టీమ్ ని ముచ్చెమటలు పట్టిస్తోంది. “భారతీయ సినిమాకు కావాల్సినంత ట్యాలెంట్, క్రియేటివిటీ ఉన్నాయి. వారు కాపీకి పాల్పడాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలై వారం రోజులు గడిచినా “అజ్ఞాతవాసి” యూనిట్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఇక, చట్టపరమైన చర్యలు తీసుకునే సమయం వచ్చింది. లీగల్ నోటీస్ పంపిస్తాను`” అంటూ హెచ్చరించారు. దీనిపై త్రివిక్రమ్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.