రీసెంట్ గా బెంగుళూరులో జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ లో ‘అఖండ’ సినిమాకి చోటు దక్కకపోవడం పట్ల నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. అవార్డ్స్ అన్నీ కూడా ‘పుష్ప’ సినిమాకే రావడంతో సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘పుష్ప’, ‘అఖండ’ సినిమా గతేడాది డిసెంబర్ నెలలో విడుదలయ్యాయి. వరల్డ్ వైడ్ లెక్కల్లో రెవెన్యూ పరంగా తేడా ఉండొచ్చు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బయ్యర్లకు ‘పుష్ప’ కంటే ‘అఖండ’ సినిమానే ఎక్కువ లాభాలు తీసుకొచ్చింది.
రీసెంట్ గా దర్శకుడు తేజ ‘పుష్ప’ సినిమా కారణంగా బయ్యర్లు నష్టాలపాలయ్యారని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫిలిం ఫేర్ అవార్డ్స్ కోసం అన్ని కమర్షియల్ సినిమాలను కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటారు. ‘పుష్ప’ పక్కా కమర్షియల్ సినిమా అనే చెప్పాలి. అయితే ‘అఖండ’లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు హిందూ మత తత్వాన్ని గొప్పగా చూపించారు. కంటెంట్ పరంగా బాలయ్య సినిమానే గొప్ప అని వాదిస్తున్నారు నందమూరి అభిమానులు.
అయితే ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ నిర్వహించేది బాలీవుడ్ సంస్థలు కాబట్టి వాళ్లకు ‘పుష్ప’ నార్త్ లో సాధించిన ఘనవిజయం కొలమానంగా కనిపించి ఉండొచ్చు. ‘అఖండ’ సినిమాను ఆ సమయంలో హిందీ డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయలేదు. ఆ కారణంగానే అక్కడి వాళ్లకు ‘అఖండ’ రీచ్ కాలేకపోయింది. తరువాత హాట్ స్టార్ లో చూసిన వాళ్లు థియేటర్లో సినిమా రిలీజ్ అయి ఉంటే బాగుండేదని అనుకున్నారు.
‘అఖండ’ సినిమాను పక్కన పెట్టి అన్ని అవార్డులు ‘పుష్ప’ సినిమాకే ఇవ్వడంతో చిక్కొచ్చి పడింది. నంది అవార్డ్స్ ఇచ్చిన సమయంలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు నంది అవార్డులు కనుమరుగయ్యాక ఫిల్మ్ ఫేర్ కి ప్రాధాన్యం పెరిగిందనే చెప్పాలి.