‘అఖండ’ సినిమా బ్రహ్మాండమైన విజయంతో దూసుకుపోతోంది. సరైన బ్లాక్‌బస్టర్ లేక దిగాలుగా ఉన్న టాలీవుడ్‌కి అదిరిపోయే ఆనందం ఇచ్చాడు. ఈ సినిమాతో డబుల్ హ్యాపీ అందుకుంటున్న వారిలో బాలకృష్ణ, బోయపాటి, తమన్ ఉన్నారు. అయితే ఒకరికి మాత్రం ఈ సినిమా విజయం ఇప్పటివరకు ఎలాంటి యూజ్ అవ్వలేదు. ఆయనే సినిమాలో అతి క్రూరంగా కనిపించిన శ్రీకాంత్. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు పక్కా అనుకున్నా… ఆ స్థాయిలో రెస్పాన్స్ లేదు అంటున్నారు పరిశీలకులు.
‘లెజెండ్’ సినిమాలో విలన్‌గా నటించిన జగపతిబాబు… ఇప్పటికీ వెర్సటైల్ విలన్‌గా వరుస అవకాశాలు సంపాదిస్తున్నాడు. ఒకటికి మించి పాత్ర ఇంకొకటి ఆయన తలుపుతడుతూనే ఉంది. అయితే శ్రీకాంత్ విషయంలో మాత్రం ఇలాంటి ఫీల్ ఇంతవరకు రాలేదు అంటున్నారు. శ్రీకాంత్ పాత్ర విషయంలో చూపించిన అతి… ఆయనకు ఇబ్బంది పెడుతోంది అనే వాదనలూ వినిపిస్తున్నాయి. పూర్ణ రేప్ సీన్, చిన్న పిల్లాడి తల మీద సుత్తితో కొట్టే సీన్… సీన్‌ను ఎలివేట్ చేసినా, పాత్రను ఎలివేట్ చేయలేదు.
అలాగే ప్రేక్షకులు సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు చర్చకు వస్తున్నవాటిలో బాలకృష్ణ పర్‌ఫార్మెన్స్, బోయపాటి ఎలివేషన్లు, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించే ఎక్కువగా వినిపిస్తోంది. శ్రీకాంత్ విలనిజం గురించి అంతగా చర్చ లేదు. దీంతో వ్రతం పూర్తయింది, ఫలితం దక్కలేదు అన్నట్లుగా మారింది అంటున్నారు. లేదంటే కాస్త లేటయినా ఫర్వాలేదు… విలన్‌గా అయినా మంచి సినిమా ఓకే చేద్దాం అనుకుంటున్నాడా… అనేది తెలియడం లేదు.