టైమ్ బేస్డ్ కథలతో హిట్స్ అందుకున్న డైరక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని ప్రిన్స్ అఖిల్ హలో సినిమా చేశారు. ఇది కూడా టైమ్ బేస్డ్ కథే. హాఫ్ డే లో జరిగే మిరాకిల్ ఈ మూవీ. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 40 కోట్ల బడ్జెట్ తో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న అఖిల్ ఈ మూవీ గురించి ఆసక్తికర సంగతి వెల్లడించారు. “విక్రమ్ చెప్పిన మూడు స్టోరీ లైన్స్ లో ఒకటి సెలక్ట్ చేయడంతోనే నా పని పూర్తయింది. స్టోరీ డెవలప్ మెంట్, సీన్ నెరేషన్ మొత్తం నాన్న, విక్రమ్ చూసుకున్నారు.
మరుసటి రోజు చేయాల్సిన సన్నివేశం కూడా ముందురోజు నాకు చెప్పేవారు కాదు. సినిమా మొత్తం అలానే చేశారు. కంప్లీట్ మూవీ మొన్ననే చూశాను. అప్పటివరకు నేనేం చేశానో నాకు అర్థం కాలేదు.” అని అఖిల్ తెరవెనుక జరిగిన సంగతిని వెల్లడించారు. నేచురల్ ఎక్స్ ప్రెషన్స్ కోసం ఇలా కథను దాచి పెట్టారని వివరించారు. “క్లైమాక్స్ కూడా పెద్ద డైలాగ్స్ ఉన్నాయి కాబట్టే ముందు రోజు చెప్పారు. మిగతా అన్ని సీన్స్ ను సెట్స్ పైకి వచ్చిన తర్వాతే విక్రమ్ వివరించారు” అని అఖిల్ తెలిపారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.