అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ‘ఏజెంట్’ (Agent) అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.85 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమాలకి మాస్ లో మంచి క్రేజ్ ఉంటుంది.మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం కూడా సినిమా బిజినెస్ కి పని చేసినట్టు అయ్యింది.
అయితే రిలీజ్ రోజున ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘ఏజెంట్’ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఎలాంటి సినిమా అయినా 4 వారాలకి ఓటీటీలోకి రావడం ఆనవాయితీగా మారింది. థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన సినిమాలకి సైతం ఓటీటీల్లో మంచి టాక్ వస్తుండటాన్ని మనం చూస్తూనే వస్తున్నాం. అయితే ‘ఏజెంట్’ దానికి కూడా నోచుకోలేదు. విడుదలై రెండేళ్లు గడిచినా ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు.
అందుకు కారణం ఈ సినిమాకి వచ్చిన నష్టాల కారణంగా ‘ఏజెంట్’ ని పంపిణీ చేసిన ఓ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత అనిల్ సుంకరపై కేసు వేయడమే అని చెప్పాలి. కేసు కోర్టులో ఉన్న కారణంగా ‘ఏజెంట్’ ఓటీటీలో కానీ, టీవీల్లో కానీ ప్రసారం కాలేదు. అయితే ఇప్పుడు ఆ గొడవలు అన్నీ తీరిపోయినట్టు తెలుస్తుంది. దీంతో త్వరలోనే ఏజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఏజెంట్’ చిత్రం మార్చి 14 నుండి సోనీ లివ్ లో ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తుంది.