దివంగత స్టార్ హీరో, అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవస్థాపకుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి చిన్న కుమారుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టారు అక్కినేని నాగార్జున. స్టార్ కిడ్ అయినప్పటికీ హీరోగా నిలబడడానికి నాగార్జున ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది. ‘విక్రమ్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున… డెబ్యూ మూవీతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు.
ఆ తర్వాత చేసిన ‘కెప్టెన్ నాగార్జున’ ‘అరణ్య కాండ’ వంటి సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఈ క్రమంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో చేసిన ‘మజ్ను’ పెద్ద హిట్ అయ్యింది. నాగార్జునని హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత ‘సంకీర్తన’ ‘కలెక్టర్ గారి అబ్బాయి’ ‘అగ్నిపుత్రుడు’ ‘కిరాయి దాదా’ ‘ఆఖరి పోరాటం’ ‘చినబాబు’ ‘జానకి రాముడు’ వంటి సినిమాలు చేస్తూ వచ్చారు.
ఇందులో ‘కలెక్టర్ గారి అబ్బాయి’ ‘ఆఖరి పోరాటం’ ‘జానకి రాముడు’ వంటి సినిమాలు బాగానే ఆడాయి. అయితే ఇవి నాగార్జున బ్యాక్ గ్రౌండ్ వల్ల వచ్చిన సినిమాలు అని చాలా మంది అనుకున్నారట.’ఆఖరి పోరాటం’ సినిమా మంచి హిట్ అయినా.. నాగార్జున సంతృప్తి చెందలేదట.
ఎందుకంటే ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా హీరోయిన్ శ్రీదేవి, దర్శకుడు కె.రాఘవేంద్రరావు కి వెళ్ళిపోయిందట. ‘నేను మధ్యలో బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది’ అంటూ నాగార్జున ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందరినీ షాక్ కు గురిచేసింది. అప్పటి నుండి నాగార్జున.. నాగేశ్వరరావు కొడుకుగా కాకుండా.. తనను తాను ప్రూవ్ చేసుకునే విధంగా కథలు ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టానని కూడా ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.