సినిమా పరిశ్రమలో స్టంట్ మ్యాన్‌ల పరిస్థితి గురించి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం స్టంట్ మ్యాన్ మోహన్ రాజ్ అలియాస్ ఎస్ఎం రాజు సినిమా షూటింగ్‌లో భాగంగా కారు పల్టీ స్టంట్ చేస్తూ గుండె పోటు వచ్చి మరణించాడు. దీంతో సినిమా పరిశ్రమలో స్టంట్ మ్యాన్‌ల పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఓ పని చర్చలోకి వచ్చింది.
ఆర్య – పా.రంజిత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వేట్టువం’ సినిమా షూటింగ్‌లో జరిగిన స్టంట్‌మ్యాన్ రాజు మీతి గురించి తెలిసి అక్షయ్ కుమార్ చలించిపోయారు. అంతేకాదు స్టంట్ మ్యాన్‌ల విషయంలో ఓ నిర్ణయం కూడా తీసుకున్నారు. అదే ఇండస్ట్రీలోని 700 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ చేయించారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబానికి అండగా ఉండేలా ఈ ఏర్పాటు చేశారు అక్షయ్.
అక్షయ్ తీయించిన ఇన్సూరెన్స్ పాలసీలో ఆరోగ్య, ప్రమాద బీమా ఉన్నాయి. స్టంట్ మ్యాన్ సెట్‌లో, బయట ఎక్కడైనా గాయపడితే రూ.5 లక్షల వరకు బీమా పొందే ఏర్పాటు చేశారు. దీంతో అక్షయ్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మీరు చేసిన ఈ పని వల్ల బాలీవుడ్‌లో దాదాపు 700 మంది స్టంట్ మ్యాన్‌లు, యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు అంటూ బాలీవుడ్ జనాలు కొనియాడుతున్నారు.
అక్షయ్ కుమార్ స్టంట్స్ చేయడంలో దిట్ట. ఆయన సినిమా టీమ్‌లో స్టంట్ మ్యాన్‌లకు పని ఎక్కువగా ఉంటుంది. రిస్కీ షాట్లు కూడా ఉంటాయి. అందుకే ఆయనకు ఈ ఇబ్బంది తెలిసి, తాజా ఘటనల నేపథ్యంలో బీమా తీసుకున్నారు అని చెప్పొచ్చు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇతర పరిశ్రమల్లోని స్టార్ హీరోలు ఏమన్నా ఇలాంటి ఇన్సూరెన్స్‌లు తీసుకునేందు ముందుకొస్తారేమో చూడాలి. లేకపోతే పరిశ్రమ పెద్దలు ఈ ఆలోచన చేసినా మంచిదే.