లాక్ డౌన్ అనంతరం థియేటర్లు పునః ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో కొత్త సినిమాలు కొన్ని విడుదలయ్యాయి. కానీ సందడి మాత్రం లేదు. నామమాత్రపు షోలతో థియేటర్లు ఖాళీగా కనిపించాయి. హాలీవుడ్ సినిమా ‘టెనెట్’ను చూడడానికి జనాలు థియేటర్లకు వస్తారని భావించారు కానీ ఆశించిన స్థాయిలో రాలేదు. రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కొత్త సినిమా రిలీజైతే కనిపించే సందడి ఎంతమాత్రం లేదు.
ఇప్పుడిప్పుడే ఆ హడావిడి మొదలవుతోంది. ఎందుకంటే లాక్ డౌన్ తరువాత తొమ్మిది నెలల గ్యాప్ తరువాత ఒక పేరున్న సినిమా థియేటర్లోకి రాబోతుంది. అదే ‘సోలో బ్రతుకే సో బెటర్’. మరో వారంలోపే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మొదట ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్పినప్పుడు నమ్మశక్యం కలగలేదు. పైగా యాభై శాతం ఆక్యుపెన్సీ కాబట్టి సినిమాను అసలు రిలీజ్ చేయరని అనుకున్నారు. కానీ చిత్రబృందం రిలీజ్ సిద్ధమయ్యే.. రిలీజ్ డేట్ ప్రకటించింది. సాధారణంగా కొత్త సినిమా రిలీజ్ అయ్యే ముందు థియేటర్ల జాబితాతో పేపర్లలో యాడ్స్ ఇస్తారు.
సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి సంబంధించి హైదరాబాద్, ఇతర తెలంగాణ మెయిన్ ఏరియాల్లో సినిమా ప్రసారం కానున్న థియేటర్లతో కూడిన ఓ పోస్టర్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ట్విట్టర్ లో హల్చల్ చేస్తోంది. తొమ్మిది నెలల తరువాత లాంటి పోస్టర్ కనిపించడంతో సినీ అభిమానుల్లో సందడి మొదలైంది.