కరోనా ఫీవర్ కారణంగా ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూను విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. దాంతో ఒటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఎరోస్ వంటి పెద్ద సంస్థలైతే.. ముందుగా తమ ప్లాట్ ఫార్మ్ ను జనాలకు అలవాటు చేయడం కోసం నెలరోజుల ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఇచ్చేసింది. ఇక అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి వాళ్ళందరూ రోజుకో కొత్త కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు. కానీ.. అల్లు అరవింద్ అత్యంత ఆర్భాటంగా మొదలెట్టిన ” ఆహా’ యాప్ మాత్రం ఈ క్వారంటైన్ టైమ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. అందుకు కారణం పూర్తిస్థాయిలో ప్రీప్రొడక్షన్ ప్లాన్ లేకపోవడమే.
ఒక యాప్ లాంచ్ అవుతుంది అంటే అందులో కనీసం 100 సినిమాలు, ఓ 50 వెబ్ సిరీస్ లు ఉండేలా చూసుకోవాలి. అలాంటివేమీ లేకుండా చాలా లిమిటెడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో మొదలైన అల్లు అరవింద్ “ఆహా”లో పెద్దగా కంటెంట్ లేకపోవడంతో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నా పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే.. అల్లు అరవింద్ ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ బిజినెస్ ను పూర్తిస్థాయిలో అంచనా వేయలేకపోయారని మాత్రం అర్ధమవుతుంది. మరి ఈ విషయంలో అల్లు అరవింద్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటారో చూడాలి.