టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ అయ్యాడనే వార్త సంచలనంగా మారింది. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ ఫ్యామిలీతో సంధ్య థియేటర్ కి వెళ్లడం, అక్కడ తొక్కిసలాట జరగడం.. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది. దీంతో పోలీసులు అల్లు అర్జున్ అలాగే అతని టీంపై కేసు నమోదు చేయడం జరిగింది. రేవతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం వల్లే పోలీసులు కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
తర్వాత అల్లు అర్జున్, ‘పుష్ప 2’ నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ ఈ ఘటనపై స్పందించి తమ వంతు సాయం చేస్తామని వెల్లడించారు. అల్లు అర్జున్ బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ సరైన భద్రతా ఏర్పాట్లు చేసుకోకుండా అల్లు అర్జున్ థియేటర్ విజిట్ చేయడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రేవతి కుటుంబం కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేయడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.
ఇక తాజాగా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ టీం స్పందిస్తూ.. ‘కేవలం విచారణ కొరకు మాత్రమే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది’ అంటూ చెప్పుకొస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది.