చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఈమధ్యకాలంలో ఏ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగినా.. హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా ఎవరో ఒకరు స్టేజ్ మీదకి రావడం, హీరో కాళ్ళు పట్టుకోవడమో లేక కౌగిలించుకోవడమో చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మధ్యలో సంపూర్ణేష్ బాబు అయితే.. ఈ స్టేజ్ మీద కాళ్ళ మీద పడడాన్ని పేరడీలా చేసేసి అందరికీ సెటైర్ వేశాడు. అయితే.. నిన్న జరిగిన “చావు కబురు చల్లగా” ప్రీరిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా ఒకరిద్దరు కాదు ఏకంగా ఓ అరడజను మంది స్టేజ్ పైకి వచ్చేసి,
అల్లు అర్జున్ ని పట్టేసుకొన్నారు. వెంటనే బౌన్సర్లు వాళ్ళందరినీ క్లియర్ చేయడానికి నానా ఇబ్బందులుపడ్డారు. అయితే.. ఆ తరుణంలో అల్లు అర్జున్ “ప్రతి ఈవెంట్లో ఇలా కాళ్ళు పట్టుకొనేవాళ్ళని పెడతారా?” అని స్టేజ్ మీద అనడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి అభిమానులు ఇలా స్టేజ్ మీదకి రావడం అనేది మొదలైంది మెగా ఫ్యామిలీ ఈవ్ంట్స్ లోనే. “అజ్ణాతవాసి”తోనే ఈ పైత్యం మొదలైంది. రీసెంట్ గా “జాతి రత్నాలు” వైజాగ్ ఈవెంట్లో కూడా ఇదే తరహాలో అభిమాని స్టేజ్ మీదకి వచ్చి నవీన్ కాళ్ల మీద పడితే..
“నేను నిన్ను కావాలని సెట్ చేశాను అనుకుంటారు, ముందు నాకేం సంబంధం లేదని చెప్పు” ఆంటూ స్టేజ్ మీద క్లారిఫికేషన్ చేయించుకున్నాడు నవీన్. అలాంటిది అల్లు అర్జున్ ఇలా కామెంట్ చేయడం, దానికి స్టేజ్ మీద ఉన్నవాళ్ళందరూ నవ్వడం అనేది గమనార్హం. బన్నీ మీదకి మరీ అయిదారుగురు ఒకేసారి పడడం వల్ల అలా అన్నాడో ఏమో. ఇకనైనా ఇలా జనాలు స్టేజ్ లపైకి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం అనేది ఆపుతారో లేదో చూడాలి.