గోల్డెన్ వీసా.. ఇటీవల కాలంలో ఈ మాట ఎక్కువగా వింటున్నాం. సినిమా తారలకు యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను ఇటీవల జారీ చేస్తోంది. ఈ మేరకు వీసా ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్‌కు కూడా గోల్డెన్ వీసా వచ్చింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీసా విషయంలో దుబాయ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వీసా ఏంటి, ఇప్పటివరకు ఎవరకు వచ్చింది అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. యూఏఈలో ‘గోల్డోన్ వీసా’ పొందడం అంత సులభం కాదు.
ప్రముఖ నటులు, వైద్యులు, వ్యాపారవేత్తలు , శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులకు మాత్రమే ఈ వీసా లభిస్తుంది. విదేశీయులు యూఏఈలో ఎక్కువ కాలం నివసించేలా అక్కడి ప్రభుత్వం 2019లో ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. గోల్డెన్ వీసాను పొందే వ్యక్తులు యూఏఈ రాజధాని అబుదాబి లేదా దుబాయి లాంటి ప్రాంతాల్లో పదేళ్ల వరకు నివసించవచ్చు. వీటిని దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాలు అని కూడా అంటుంటారు. తొలుత దీని ఐదేళ్లు ఉండేది. కొన్నేళ్ల క్రితం దాన్ని పదేళ్లకు పెంచారు.
గోల్డెన్ వీసా ఉన్నవాళ్ల భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అక్కడ పదేళ్లు నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైతే ఆ తర్వాత ఆ గడువును పొడిగించుకోవచ్చు. అంతేకాదు పూర్తి స్థాయి ఓనర్‌షిప్‌తో యూఏఈలో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చట. అయితే ఈ వీసా రావడం కోసం కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ వీసా కావాలనుకునేవారు కనీసం రూ.21 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉండాలట. అయితే సెలబ్రిటీల విషయంలో లెక్క వేరేగా ఉంటుంది. పాపులారిటీ ఉంటేనే ఈ వీసాకు అర్హత సాధిస్తారట.
ఇక యూఏఈ ప్రభుత్వం నుండి తొలి గోల్డెన్ వీసాను అందుకున్న భారతీయ సెలబ్రిటీ షారుఖ్ ఖాన్. ఆ తర్వాత సంజయ్ దత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, సోనూ సూద్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, వరుణ్ ధావన్, రణ్‌వీర్ సింగ్, విక్రమ్, టొవినో థామస్, సునీల్ శెట్టి, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి తదితర నటులు ఉన్నారు. ఇక నటీమణుల విషయానికొస్తే.. మౌనీ రాయ్, ఊర్వశీ రౌటేలా, నేహా కక్కర్, ఫరా ఖాన్, ఉపాసన, త్రిష, పూర్ణ, కాజల్ అగర్వాల్, మీనా ఉన్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ వీసా ఉంది.