ఓ యాడ్‌లో నటించిన పాపానికి ఏకంగా లీగల్ ఇష్యూలో చిక్కుకున్నాడు అల్లు అర్జున్. మీకు కూడా గుర్తుండే ఉంటుంది ఆ యాడ్. ఆన్‌లైన్ బైక్ రైడ్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ర్యాపిడో. ఆర్టీసీ బస్సులో ప్రయాణం కంటే… ర్యాపిడో బుక్ చేసుకొని అందులో ప్రయాణం చేయడం ఉత్తమం అనే ఉద్దేశంలో అల్లు అర్జున్ ఆ యాడ్‌లో మరో వ్యక్తితో చెబుతుంటాడు. ఆ యాడ్ ప్రసారమైన వెంటనే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
ఆర్టీసీ సేవలను తక్కువ చేస్తూ… అలా యాడ్‌ను చిత్రీకరించడం సరికాదని నోటీసులు పంపించారు. ఆ యాడ్‌ను రూపొందించిన ర్యాపిడో టీమ్‌కి, అందులో నటించిన అల్లు అర్జున్‌కు కూడా ఆ నోటీసులు పంపించారు. వెంటనే ఆ యాడ్ ఆపేయాలని కోరారు. దాంతోపాటు ఈ వ్యవహారంలో తెలంగాణ ఆర్టీసీ కోర్టుకు వెళ్లింది. అక్కడ ఇటీవల విచారణ పూర్తయింది. దానిపై తీర్పు కూడా వచ్చింది. యాడ్ విషయంలో ఆర్టీసీ అధికారుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.
యాడ్ అభ్యంతరకరంగా ఉందని, వెంటనే అన్ని మాధ్యమాల నుండి తొలగించాలని ఆదేశించింది. అయితే ఆర్టీసీ నుండి నోటీసులు అందుకున్నాక ర్యాపిడో ఈ యాడ్‌లో చిన్నపాటి మార్పులు చేసింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడాన్ని వ్యతిరేకించేలా ఉన్న డైలాగ్‌ను తీసేసింది. అయితే ఇప్పుడు ఏకంగా యాడ్‌ను తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది. యూట్యూబ్‌లో ఈ యాడ్ లేకుండా చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో మార్చిన యాడ్‌ను తీసేసి, కొత్తగా యాడ్ షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతేనేం… ర్యాపిడో రచ్చ ముగిసింది, బన్నీకి ఓ సమస్య పోయింది.