నాగ చైతన్య (Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా తెరకెక్కుతున్న ‘తండేల్’ (Thandel) పాన్ ఇండియా సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. మొదట డిసెంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమా, పలు కారణాలతో ఫిబ్రవరి 7కి వాయిదా పడింది. శ్రీకాకుళం మత్స్యకారుడు పాత్రలో నటిస్తున్న చైతన్యకు ఇది కీలకమైన చిత్రం. ఈ సినిమా కోసం చైతన్య ప్రత్యేక శిక్షణ తీసుకొని, స్లాంగ్ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పడం విశేషం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.
Thandel
తాజాగా వచ్చిన మొదటి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సెకండ్ సింగిల్ త్వరలోనే విడుదల చేయాల్సిన టైమ్‌లో, అల్లు అర్జున్ (Allu Arjun) చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఈ ప్రమోషన్స్‌కి ఆటంకం కలిగించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 (Pushpa 2: The Rule) బెనిఫిట్ షో రోజున సంధ్య థియేటర్ వద్ద జరిగిన ప్రమాదకర ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, పోలీస్ విచారణలతో బన్నీ వాస్ పూర్తిగా అల్లు ఫ్యామిలీ వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు.
బన్నీ వాస్ ఈ సమయంలో తండేల్ ప్రమోషన్స్‌ను పక్కన పెట్టినట్లు సమాచారం. టెన్షన్‌తో ఉన్న అల్లు క్యాంప్ ప్రభావం గీతా ఆర్ట్స్ 2 ప్రాజెక్ట్‌లపై పడిందని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేషనల్ వైడ్ ప్రమోషన్స్‌లో జాప్యం జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భయపడుతున్నారు. కానీ, ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం 50 రోజులు సమయం ఉండటంతో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఇకపోతే, అల్లు అర్జున్ కేసు సంబంధిత వివాదం రెండు మూడు వారాల్లో ముగిసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దానితో తండేల్ ప్రమోషన్ పనులు మరల ప్రారంభం అవుతాయని, విడుదల సమయానికి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తారని మేకర్స్ విశ్వసిస్తున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్య జంట మూడోసారి కలిసి పనిచేస్తుండటంతో, ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలున్నాయి.