జానీ మాస్టర్ (Jani Master) విషయంలో ఏం జరిగింది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పోక్సో కేసు పడిన తర్వాత కూడా బెయిల్ దొరికి, సినిమాలకు పని చేస్తున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఏం జరిగింది అనేది. అయితే.. జానీ మాస్టర్ కేవలం ప్యాన్ ఇండియన్ లెవెల్ డ్యాన్స్ మాస్టర్ మాత్రమే కాదు, డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. అయితే.. మొన్నామధ్య అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రెసిడెంట్ గా జోసెఫ్ ప్రకాష్ ను ఎన్నుకున్నారు.
Jani Master
ఈ విషయమై ఇవాళ స్పందించాడు జానీ మాస్టర్. అసలు తనపై వేసిన ఆరోపణలు నిజమో కాదో ఇంకా నిరూపితం కాకముందే తనను అసోసియేషన్ నుండి తీసేసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా నిర్వహించుకున్న ఎన్నికలు చెల్లవని, ఇప్పటికే ఆ అసోసియేషన్ కు తానే ప్రెసిడెంట్ అని జానీ స్పష్టం చేశారు.
ఇందుకోసం జానీ మాస్టర్ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశాడు. అ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సందర్భంలో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్”లో (Game Changer) ఒక పాటకు కొరియోగ్రఫీ చేశానని, త్వరలోనే ఆ పాట విడుదలకానుందని జానీ ప్రకటించాడు.
మరి జానీ మాస్టర్ ఒకటికి పదిసార్లు త్వరలోనే అన్నీ బయటకి వస్తాయి అని సాగదీయడం కంటే.. ఇప్పటికైనా తన సైడ్ స్టోరీ అనేది వెల్లడించడం బెటర్. ఎందుకంటే.. ఇలానే కొన్నాళ్ళు కొనసాగింది అంటే, ఆ తర్వాత నిజం చెప్పినా జనాలు నమ్మరు. ఇకపోతే.. ఇప్పుడు డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఈ విషయమై ఏమైనా క్లారిటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.