బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఇంటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలోని ఖరీదైన బంగ్లాకు ‘సోపాన్’ అని పేరు పెట్టుకున్నారు. అందులోని అమితాబ్ తల్లితండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ ఉండేవారు. అమితాబ్ హీరో అవ్వాలని ముంబైకి వచ్చేవరకు కూడా ఆ ఇంట్లోనే ఉండేవారు. అలానే బచ్చన్ ఫ్యామిలీకి మొదటి సొంతిల్లు కూడా అదే. అయితే ఇప్పుడు ఆ ఇంటిని అమితాబ్ బచ్చన్ అమ్మేసినట్లు తెలుస్తోంది. సోపాన్ ను నెజోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవో అవని బడెర్ సుమారు రూ.23 కోట్లకు కొనుగోలు చేశారు.
బచ్చన్ ఫ్యామిలీకి అవని బడెర్ ఎప్పటినుంచో తెలుసు. ‘సోపాన్’కు దగ్గరలోనే ఆయన కూడా నివసించేవారు. ఇప్పుడు ఆ ఇంటిని ఆయన సొంతం చేసుకున్నారు. ఈ ఇంటిని అమ్మేసినప్పటికీ.. అమితాబ్ కు ముంబైలోని జుహులోనే ఐదు లగ్జరీ బంగ్లాలు ఉన్నాయి. జనక్, జల్సా, ప్రతీక్ష, వత్స, అమ్మ అని పేర్లున్న ఈ బంగ్లాలు కోట్లు విలువ చేస్తాయి. గతేడాది అంధేరిలో సుమారు రూ.31 కోట్లు పెట్టి బిగ్ బీ ఓ డూప్లెక్స్ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు.
ఆయన నెట్ వర్త్ వందల కోట్లు ఉంటాయని అంచనా. 79 ఏళ్ల ఈ నటుడు ఇప్పటికీ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకిపైగా సినిమాలు ఉన్నాయి. అందులో రెండు, మూడు సినిమాల షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘ప్రాజెక్ట్ K’లో కీలకపాత్రలో కనిపించనున్నారు అమితాబ్ బచ్చన్.