టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఈరోజు స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి చేరిన విజయ్ ని చూసుకుంటూ అభిమానులు మురిసిపోతుంటారు. అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ‘దొరసాని’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆనంద్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ముఖ్యంగా లుక్స్ విషయంలో ఆనంద్ ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
తమ్ముడిని హీరోగా చేయడంపై విజయ్ ని సైతం తప్పుబట్టారు. కానీ విజయ్, ఆనంద్ అవేవీ పట్టించుకోలేదు. తొలి సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆనంద్ కి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అతడి రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆనంద్.. తన అన్నతో పోలికే తనకు పెద్ద సమస్య అని చెప్పాడు. తనను విజయ్ తో పోల్చడం మానేయాలని ప్రేక్షకులను కోరాడు. విజయ్ హీరోగా పెద్ద స్థాయికి వెళ్లాడని.. పెద్ద విజయాలు చూశాడని, పాన్ ఇండియా స్టార్ అయ్యాడని ఆనంద్ అన్నాడు.
విజయ్ తో పోల్చి తన గురించి, తన సినిమాల గురించి ప్రేక్షకులు చాలా మాటలు అన్నారని.. దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైందని చెప్పిన ఆనంద్.. విజయ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి రావడం వలన తనకు కలిగిన ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వినోద్ అనంతోజు అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి!