పెద్ద సినిమా, పెద్ద సినిమా అని చెప్పే సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల విషయంలో స్పెషల్ ఆఫర్ ఉంది. అయితే అది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. అయితే ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (C. Aswani Dutt) మాటలు వింటుంటే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకే తరహా నిర్ణయం ఉండబోతోంది అనిపిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా విషయంలో, ఆ సినిమా టికెట్ ధరల విషయంలో గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటిపై ఇటీవల అశ్వనీదత్ స్పందించారు. ఆ మాటలు చూస్తుంటేనే ‘ఒకే తరహా’ కాన్సెప్ట్ బయటకు వచ్చింది.
అశ్వనీదత్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపై మరింత వివరణ ఇచ్చేలా ఓ పోస్ట్ పెట్టారు. సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతిసారి ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఓ శాశ్వత ప్రతిపాదన చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అనుకుంటున్నారు. నిర్మాతలు ఈ విషయం మీద ఆలోచించి, చర్చించి నిర్ణయం తీసుకోమని ఇటీవల కలసినప్పుడు సూచించారట.
అంతేకాదు ఎంత బడ్జెట్ పెడితే టికెట్ రేట్లు ఎంతవరకూ పెంచుకోవచ్చో ఒక నిర్ణయానికి రమ్మని కూడా అన్నారట. మీరు ఓసారి మాట్లాడుకున్నాక.. ఆ విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడతా అని పవన్ హామీ ఇచ్చారని అశ్వనీదత్ పేర్కొన్నారు. సినిమా నిర్మాతలకు, ప్రేక్షకులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుందామని పవన్ అన్నారట. ఈ లెక్కన త్వరలో నిర్ణయం తీసుకుని నిర్మాతలందరూ ఏపీ సీఎంను కలుస్తారట.
ఈ లెక్కన తెలంగాణ తరహాలో టికెట్ రేట్ల పెంపు విషయంలో వచ్చిన శాశ్వత నిర్ణయం (జీవో) తరహాలో ఏపీలో కూడా ఒకటి వచ్చేస్తుంది. అంటే టికెట్ రేటు విషయంలో గరిష్ఠంగా ఓ ధర ఇచ్చేస్తారు. ఎవరు నచ్చిన ధరతో వారు టికెట్టు అమ్ముకోవచ్చు. ప్రతిసారి నిర్మాతలు ధరలు పెంచమని ప్రభుత్వాన్ని అడగక్కర్లేదు.