టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు ఒక అరుదైన రికార్డ్ కు చేరువలో ఉన్నారు. వరుసగా తొమ్మిది హిట్లు కొట్టిన ఈ ‘హిట్ మెషిన్’, తన 10వ సినిమాతో టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డును సెట్ చేసేలా కనిపిస్తున్నారు. అదే జరిగితే, ఈ తరం దర్శకులలో నలుగురు అగ్ర సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసిన ఏకైక దర్శకుడిగా అనిల్ చరిత్ర సృష్టిస్తారు.
ఇప్పటికే విక్టరీ వెంకటేష్‌తో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన అనిల్, నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ వంటి పవర్‌ఫుల్ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే 226 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి, ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే దిశగా సాగుతోంది.
ఇక అనిల్ రావిపూడి లైనప్‌లో మిగిలి ఉన్న ఏకైక సీనియర్ అగ్ర హీరో కింగ్ నాగార్జున మాత్రమే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అనిల్ తన 10వ సినిమాను నాగార్జునతోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను అనిల్ సిద్ధం చేస్తున్నారని, దీనికి సంబంధించి చర్చలు కూడా తుది దశలో ఉన్నాయని సమాచారం. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఇలా నలుగురు సీనియర్ స్టార్లను డైరెక్ట్ చేసిన రికార్డు అనిల్ ఖాతాలో చేరుతుంది.
వేగంగా స్క్రిప్ట్ రాయడంలో అనిల్ ఇప్పటికే ఒక రికార్డును క్రియేట్ చేశారు. సాధారణంగా మూడు నెలల సమయం తీసుకునే ఆయన, చిరంజీవి సినిమా కథను కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తన 10వ సినిమా కోసం కూడా అదే స్పీడ్‌లో వర్క్ చేస్తున్నారని, ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. నాగార్జునతో చేయబోయే సినిమా కూడా 2027 సంక్రాంతిని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే వెంకటేష్ తో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఈ కాంబినేషన్ లో ఏది సెట్టవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
