ఇండియన్ సినిమాలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ సినిమాలు అంటే… ఠక్కున గుర్తొచ్చే ఇండస్ట్రీ టాలీవుడ్. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలకు ఇప్పుడు మన టాలీవుడ్ కార్ఖానాగా మారిపోయింది. అలా ఇప్పుడు దేశంలోనే నాలుగు అతి పెద్ద సినిమాలు రూపొందుతున్నాయి. వాటికి వేర్వేరు నిర్మాతలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయా సినిమాలను వేర్వేరు డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడో విచిత్రమైన విషయం ఉంది. అదే ఈ సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేయబోయేది ఒకరే.
మొన్నీమధ్య ‘దేవర’ (Devara) సినిమా బాలీవుడ్ హక్కుల పంచాయితీ తేలింది. చాలా కాలంగా నానుతున్న ఈ విషయాన్ని కరణ్ జోహార్ (Karan Johar) – అనిల్ తడానీకి ఇచ్చేస్తున్నట్లు తేల్చేశారు. ఈ క్రమంలో మరో మూడు పెద్ద సినిమాలు కూడా ఈ ఆలోచనలో ఉన్నాయి అని చెబుతున్నారు. ఆ లిస్ట్‌లో ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD), అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) , రామ్‌చరణ్ – (Ram Charan) శంకర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఉన్నాయట. ఈ డీల్స్ పూర్తయ్యాక టీమ్స్ ఈ విషయం అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాయట.
దీంతో మన దగ్గర రూపొందుతున్న భారీ చిత్రాలు బాలీవుడ్‌లో అనిల్ తడానీ చేతుల్లోకి వెళ్తున్నాయి అని అర్థమవుతోంది. గతంలో ‘బాహుబలి’ (Baahubali) రెండు పార్టులు… ‘కేజీయఫ్’ (KGF) రెండు పార్టులు, ‘కాంతార’, ‘పుష్ప’ (Pushpa) , ‘సలార్’ (Salaar) , ‘హను – మాన్’ (Hanu Man) ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు మరో నాలుగు పెద్ద సినిమాలను లైన్‌లో పెట్టారు. దీంతో ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రథమార్ధం మొత్తం మన పెద్ద సినిమాల బాలీవుడ్ భవితవ్యం అనిల్ తడానీ చేతుల్లో ఉందని అర్థమవుతోంది.
మొత్తం అనిల్ తడానీ చేతుల్లో ఉంది అంటున్నారు. కానీ పైన నిన్నటి తరం హీరోయిన్ రవీనా టాండన్ పేరు చెప్పారేంటి అనుకుంటున్నారా? అనిల్ తడానీ – రవీనా టాండన్ (Raveena Tandon) భార్యభర్తలు. ఆ లెక్కన ఆ సినిమాలు మొత్తం రవీనా చేతుల్లో ఉన్నట్లే కదా. అన్నట్లు వారి తనయ రాషా తడానీ త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందట.