హీరోను విలన్‌లా చూపిస్తే… ఎలా ఉంటుందో చూశాం, హీరోను నెగిటివ్ షేడ్స్ చూపిస్తే ఎలా ఉంటుందో చూశాం.. అదే హీరోను యానిమల్‌లా చూపిస్తే… కచ్చితంగా మనం చూడలేదు. అందులో స్టార్ హీరోను అలా చూపిస్తే.. ఆ స్టార్ హీరోకు లవర్ బాయ్ ఇమేజ్ ఉంటే… అస్సలు చూసి ఉండం. ఎందుకంటే అలా చూపించిన దర్శకులు లేరు. అలా చేసిన దర్శకులూ తక్కువే. బాలీవుడ్‌లో అయితే ఇంకా తక్కువ. అందుకేనేమో మన దగ్గర నుండి బాలీవుడ్‌కి వెళ్లి ఓ చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోను ‘యానిమల్’ లా చూపించారు.
ఇప్పటికే అర్థమైపోయుంటుంది. ఆ సినిమా ‘యానమిల్’ అని, ఆ హీరో రణ్‌బీర్ కపూర్ అని, ఆ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే.. ఆ ‘యానిమల్’ ప్రపంచాన్ని, ఆ ‘యానిమల్’ జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను వదిలారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా టీజర్ వచ్చేసింది. తండ్రీ కొడుకుల బంధం గురించి ఇప్పటివరకు మనం చాలా విన్నాం, చాలా కథలు చూశాం. అయితే ‘యానిమల్’ సినిమాలో చూపించింది అంతకుమించి.
ఇంకా చెప్పాలంటే ఊహించలేని బంధం అది. నిత్యం తిట్టే, ఎప్పుడూ కొట్టే ఓ తండ్రిని తన కొడుకు ఎలా అర్థం చేసుకున్నాడు, అసలు ఆ తండ్రి అలా ఎందుకు మారాడు, కొడుకు ఏం అర్థం చేసుకున్నాడు, దాని వెనుక కథ ఏంటి అనేదే ‘యానిమల్’ సినిమా అని చెప్పొచ్చు. అంత హార్స్‌గా ఉన్న తండ్రి విషయంలో కొడుకు ఎందుకు అంత కూల్‌గా ఎలా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు అనేది టీజర్‌లో చెప్పకుండా వదిలేసిన పాయింట్. తండ్రి చిన్న మాట అంటే పడని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో తండ్రి కొట్టినా, ఇంట్లో వాళ్లు తిట్టినా భరించేలా ఇంకా చెప్పాలంటే దాని కోసం ‘యానిమల్’ అయిపోయిన కొడుకు కథ ఈ సినిమా.
సందీప్ రెడ్డి వంగా స్టైల్ మాస్ ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. రష్మిక మందన అయితే కనిపించిన ఒక్క సీన్‌లో మెరిసిపోయింది. ఇక్కడ లేని అందం అక్కడ ఎలా వచ్చింది అనే డౌట్ రాకమానదు. ఇక అనిల్ కపూర్, బాబీ డియోల్ అయితే యాటిట్యూడ్ విషయంలో అదరగొట్టేశారు. ఇక రణ్‌బీర్ గురించి చెప్పాలంటే… ఈ ‘యానిమల్’ బాగా క్రూయల్ అని చెప్పాలి. ఇక యానిమల్ విశ్వరూపం చూడాలంటే డిసెంబరు 1వరకు ఆగాల్సిందే.