‘నేను నేనుగా లేనే నిన్న మొన్నలా అంటూ..’ నాగార్జున (Nagarjuna) ఆమె వెనుక తెగ తిరిగాడు. ఆయన తర్వాత మన కుర్రాళ్లు కూడా ఆమె గురించి ఆలోచించారు. ఇండస్ట్రీకి వచ్చిన మరో మెరుపు అంటూ అందరూ మురిసిపోయారు. కట్ చేస్తే ఆమె ఆలోచన వేరేలా ఉంది. మూడంటే మూడు సినిమాలు చేసి విదేశాలకు వెళ్లిపోయింది. ఇప్పుడు ‘మజాకా’ (Mazaka) సినిమాతో మరోసారి సినిమాల్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మళ్లీ మంచి సినిమాలు చేయడానికే ఇక్కడి వచ్చాను. కథలో బలమున్న వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాలని ఉంది. ఏ తరహా పాత్రతో వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని క్లారిటీ ఇచ్చేసింది అన్షు (Anshu Ambani). రీఎంట్రీ ఓకే.. ఎంట్రీ సంగతి చెప్పండి అని అడిగితే.. 15 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టా అని చెప్పింది. అప్పటికి అంత పరిణతి లేదని, అసలు నటనను కెరీర్‌గానే భావించలేదని చెప్పింది.
అందుకే తిరిగి చదువులపైనే దృష్టి పెట్టాలనుకుని లండన్ వెళ్లిపోయా అని చెప్పింది. అలా సైకాలజీలో మాస్టర్స్ చేసి, సొంతంగా క్లీనిక్ పెట్టుకుని థెరపిస్ట్ చేశానని చెప్పింది. 24 ఏళ్ల వయసుకే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. ఇద్దరు పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చాక అని చెప్పింది. ఒకవేళ తను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ‘మన్మథుడు’ సినిమా చేసి ఉంటే మధ్యలోనే ఇండస్ట్రీ వదిలి వెళ్లేదాన్ని కాదు అని చెప్పింది.
రీఎంట్రీకి కారణమేంటి అని అడిగితే.. తన తొలి సినిమానే అసలు రీజన్ అని చెప్పారు. 2023 ఆగస్టులో ‘మన్మథుడు’ సినిమా రీ రిలీజైందని, ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లు ఓ వీడియో బైట్ ఇవ్వమని తనను సంప్రదించగా.. చేసి ఇచ్చానని చెప్పింది. సినిమాకు వచ్చిన స్పందన చూసి హైదరాబాద్‌కు రావాలనిపించిందని అన్షు చెప్పింది. అలా ‘మజాకా’ అవకాశం వచ్చిందని తెలిపింది.