సోనూ సూద్ (Sonu Sood) పేరు వినగానే చాలా మంది ముందు గుర్తు చేసుకునేది సినిమాలు కాదు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలే. కరోనా సమయంలో వేలాది మంది ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూ, తాజాగా ఓ వివాదంలో ఇరుక్కొన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లూథియానా కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు వార్తలు వస్తుండటంతో ఈ విషయం ఎంతవరకు నిజం అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపింది.
వివరాల్లోకి వెళ్తే, మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనకు రూ.10 లక్షలు మోసం చేశాడని న్యాయవాది రాజేష్ ఖన్నా లూథియానా కోర్టులో కేసు వేశారు. క్రిప్టోకరెన్సీ పేరుతో మోసం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు సోనూ సూద్‌ను సాక్షంగా హాజరయ్యేందుకు పలు మార్లు సమన్లు జారీ చేసింది. అయితే, ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో, లూథియానా కోర్టు ముంబై పోలీసులను ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందుకు తీసుకురావాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది.
ఇక ఈ వార్తలపై సోనూ సూద్ స్పందిస్తూ, తనకు అసలు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, కోర్టు మూడవ వ్యక్తికి సంబంధించిన కేసులో తనను సాక్షంగా పిలిచిందని తెలిపారు. ‘‘నాకు ఎటువంటి సంబంధం లేని కేసులో నన్ను సాక్షిగా పిలిచారు. దీనిపై మా న్యాయవాదులు ఇప్పటికే స్పందించారు. నేను ఈ కేసులో బ్రాండ్ అంబాసిడర్‌ను కూడా కాదు. ఇలా సెలబ్రిటీల పేరును అనవసరంగా వార్తల్లోకి లాగడం బాధాకరం.
కేవలం పబ్లిసిటీ కోసమే నా పేరును వాడుకుంటున్నారు. ఈ విషయంలో కఠినంగా స్పందిస్తాం’’ అని స్పష్టం చేశారు. సోనూ సూద్ చేసిన ఈ క్లారిఫికేషన్ తర్వాత, ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. గతంలోనూ ఇలాంటి అనవసర ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, ఈసారి కూడా నిజం తేల్చి బయటకు వస్తారని నమ్మకంగా ఉన్నారు.