ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశించింది. పూర్తిగా శారీరక శ్రమ అవసరమైన చోట తప్ప.. అన్ని ప్రదేశాల్లో ఏఐ వచ్చేసింది. అలా సినిమా రంగంలోకి కూడా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ముందుగా విజువల్ ఎఫెక్ట్స్‌లోకి రాగా, ఆ తర్వాత సంగీత దర్శకత్వం, గానం వైపు కూడా ఓ చూపు చూస్తోంది. ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను ఇప్పటికే వినియోగించి ప్రముఖ సంగీత దర్శకుడు.. అందరూ వాడే విషయంలో మాత్రం ఆందోళన చెందుతున్నారు.
సినిమాల్లో ఏఐ ఉపయోగించి దివంగత గాయనీగాయకుల వాయిస్‌తో పాటలు క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (Ar Rahman) ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. సినిమాల్లో ఏఐ వినియోగాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో మరిన్ని గందరగోళ పరిస్థితులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఏఐ శక్తిమంతమైనదే అని, అయితే అవసరానికి మించి వినియోగించుకుంటే ఇబ్బందులు తప్పవని ఆయన సూచించారు. ఏఐని మంచి కోసమే వినియోగించాలి. కొన్ని రోజులుగా చూస్తుంటే ఆందోళన కలుగుతోంది.
కొన్ని చెత్త పాటలను కూడా గొప్ప గాయకులు పాడినట్లు ఏఐతో క్రియేట్ చేస్తున్నారు. మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రతి విషయానికి కొన్ని నియమాలు ఉంటాయి. టెక్నాలజీని ఉపయోగించడానికి పరిమితులు ఉంటాయి. వాటిని అందరూ తెలుసుకోవాలి అని ఆయన చెప్పీ చెప్పకుండా అందరూ ఏఐ వాడటం, అందరి గొంతుల్ని ఏఐతో తీసుకురావడం సరికాదు అని అన్నారు. అయితే రజనీకాంత్ (Rajinikanth) ఓ పాత్రలో నటించిన ‘లాల్ సలామ్’ (Lal Salaam) సినిమాలో దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్ గొంతులో ఏఐ ద్వారా ఓ పాటను పాడించారు.
అలాంటిది ఆయన ఇప్పుడు వేరే వాళ్లు అలా పాటలు రూపొందిస్తుంటే ఎందుకు ఇబ్బందిపడుతున్నారో తెలియడం లేదు. కచ్చితంగా ఆయనలాగే అందరూ పర్మిషన్ తీసుకునే పాటలు రూపొందించి ఉంటారు. ఇటీవల ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా కోసం భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo).. దివంగత చక్రి (Chakri) గొంతును ఏఐతో రీక్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆయననే కాదు చాలామంది ఇదే ప్రయత్నంలో ఉన్నారు.