భారతీయ సంగీత ప్రపంచంలో ఏఆర్ రెహమాన్ పేరు ఒక బ్రాండ్. ఆస్కార్ అవార్డును భారత్‌కు అందించి గ్లోబల్ లెవల్లో మన సత్తా చాటిన ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ’ కోసం పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఆయన రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి మతపరమైన కారణాలు ఉన్నాయంటూ ఆయన చేసిన కామెంట్స్ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
గత ఎనిమిదేళ్లుగా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు సరైన ఆఫర్లు రాకపోవడానికి ఇండస్ట్రీ మతత్వంగా మారిపోవడమే ప్రధాన కారణమని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న కొందరు వ్యక్తులు సృజనాత్మకత కంటే ఇలాంటి విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక పెద్ద మ్యూజిక్ కంపెనీ తనను సంప్రదించినా చివరకు మరో ఐదుగురిని తీసుకున్నారని, అది మతపరమైన కోణమే కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది.
రెహమాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ సీనియర్ రైటర్ జావేద్ అక్తర్ తనదైన శైలిలో స్పందించారు. రెహమాన్ అంటే ఇండస్ట్రీలో అందరికీ అపారమైన గౌరవం ఉందని, ఆ గౌరవం వల్లే చాలా మంది ఆయనను సంప్రదించడానికి భయపడుతున్నారని అక్తర్ పేర్కొన్నారు. ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి పని చేయాలంటే ఆయన స్థాయికి తగ్గట్టుగా చర్చలు జరపాలని, అది సాధ్యం కాకే చాలా మంది వెనకడుగు వేస్తున్నారని ఆయన వివరించారు. అంతేకానీ ఇక్కడ మతానికి ఎలాంటి సంబంధం లేదని అక్తర్ స్పష్టం చేశారు.
జావేద్ అక్తర్ మాటలను బట్టి చూస్తుంటే రెహమాన్ తనపై ఉన్న గౌరవాన్ని లేదా ఇండస్ట్రీలోని మార్పులను తప్పుగా అర్థం చేసుకున్నారా అనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రెహమాన్ లాంటి పెద్ద స్థాయి వ్యక్తి ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించి ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేవలం తన సంగీతంతో అందరినీ మాయ చేసే రెహమాన్, ఇప్పుడు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆయన అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
