AR Rahman: మైఖేల్‌ జాక్సన్‌తో పాట పాడిద్దాం అనుకున్నాం.. కానీ బ్యాడ్‌లక్‌

  • July 11, 2024 / 08:03 PM IST

ప్రపచం మేటి పాప్‌స్టార్‌ మైకేల్‌ జాక్సన్‌ మన దేశానికి వచ్చి, అందులోనూ సౌత్‌కి వచ్చి ఓ సినిమాలో పాట పాడి ఉంటే ఎలా ఉండేది చెప్పండి. అదిరిపోయేది కదా.. అయితే ఇలాంటి అవకాశం మనకు దక్కినట్లే దక్కి దక్కకుండా పోయింది. జాక్సన్‌తో ఓ సినిమాలో పాట పాడిద్దాం అనుకున్నామని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (A.R.Rahman) చెప్పారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆయనతో కలసి పని చేయాలని అనుకున్నామని కానీ.. ఆ కల నెరవేరకముందే జాక్సన్‌ కన్నుమూశారని ఏఆర్‌ రెహమాన్‌ ఎమోషనల్‌గా చెప్పారు.

ఇంతకీ ఏమైందంటే.. మైకేల్‌ జాక్సన్‌తో రెహమాన్‌కు మంచి పరిచయం ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆస్కార్‌’ అందుకున్న తర్వాత ఆ పరిచయంతోనే ఓ సారి జాక్సన్‌ ఇంటికి వెళ్లారట రెహమాన్‌. ఆ సమయంలో మాటల్లో ప్రపంచ శాంతి గురించే ఎక్కువగా మాట్లాడారట జాక్సన్‌. ఇండియాకి తిరిగొచ్చాక దర్శకుడు శంకర్‌తో (Shankar) జాక్సన్‌ను కలసిన విషయం, అక్కడ మాట్లాడుకున్న విషయాలు చెప్పారట రెహమాన్‌. అప్పుడే ‘రోబో’ (Robo) సినిమా పనులు సాగుతున్నాయట. దీంతో ‘జాక్సన్‌తో సినిమాలో ఏదైనా పాట పాడిద్దామా’ అని శంకర్‌ తన మనసులో మాట బయటపెట్టారట.

దానికి రెహమాన్‌ స్పందిస్తూ.. ఆలోచన బాగుంది. కానీ, ఆయన తమిళ పాట పాడతారా? అని అన్నారట. ఆ తర్వాత కొంత కాలానికే దురదృష్టవశాత్తు జాక్సన్‌ కన్నుమూశారు అని రెహమాన్‌ పేర్కొన్నారు. అలా మనం జాక్సన్‌ సౌత్‌ పాటను మిస్‌ అయ్యాం. ఇటీవల మలేసియాలో జరిగిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో అభిమానులు అడగ్గా.. జాక్సన్‌ గురించి రెహమాన్‌ ఈ విషయాలు చెప్పుకొచ్చారు.

ఆస్కార్‌ సహా ఎన్నో అవార్డులు అందుకున్న మీరు ఇంత వినయంగా ఎలా ఉండగలుతున్నారు అని మీట్‌ అండ్‌ గ్రీట్‌లో అభిమాని అడగ్గా.. అహంకారం అందరిలోనూ ఉంటుంది. కానీ, దానిని ఎటువైపు ఉంచాలి, ఎలా చూడాలి అనేది మన చేతిలోనే ఉంటుంది అని చెప్పారు. ఇక ఫైనల్‌గా ఆయన ‘ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో ఉండాలంటే ‘గొర్రెలా కాకుండా పులిలా ఉండాలి’ అని సలహా ఇచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus