Thangalaan Trailer Review: లాస్ట్‌ షాట్‌ చూశాక.. ఈ సినిమా ఎప్పుడొస్తుంది అని అడగక మానరు!

  • July 11, 2024 / 11:00 AM IST

విక్రమ్‌ (Vikram) సినిమా అంటే ప్రయోగశాల అని చెప్పొచ్చు. కథ నుండి కథనం వరకు, పాత్ర చిత్రణ నుండి మేనరిజం వరకు అన్నింటా ఆయన తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి నటుణ్ని తీసుకొని బడుగు బలహీన వర్గాల సినిమాలు తీసే దర్శకుడు పా.రంజిత్‌ (Pa. Ranjith) చేసిన సినిమా ‘తంగలాన్‌’ (Thangalaan) . చాలా నెలలుగా సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఆ ట్రైలర్‌ చూశాక.. ‘సినిమా రిలీజ్‌ ఎప్పుడో చెప్పు..’ అని అడగుతున్నారు ప్రేక్షకులు.

దానికి కారణం, ట్రైలర్‌లోని సన్నివేశాలు, వాటిని విక్రమ్‌ చేసిన విధానం. పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రంగా కేఈ జ్ఞానవేల్‌ రాజా (K. E. Gnanavel Raja) ఈ సినిమాను నిర్మించారు. మాళవిక మోహనన్ (Malavika Mohanan) , పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu) ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో సాగుతుంది. బ్రిటిష్‌ వారి పాలనలో జరిగిన వాస్తవ సంఘటనలు, పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. దీని కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు దర్శకుడు పా.రంజిత్‌.

ఇక ట్రైలర్‌ సంగతి చూస్తే.. కోలార్‌ బంగారు గనుల్లోని బంగారాన్ని వెలికి తీయడానికి బ్రిటిష్‌ అధికారులు స్థానిక గిరిజనుల్ని పనిలో పెట్టుకుంటారు.అందులో ఓ గిరిజన తెగ నాయకుడిగా విక్రమ్‌ నటించాడు. విభిన్నమైన లుక్‌లో ఆ పాత్ర ఉంటుంది. గనుల్లోని బంగారాన్ని వెలికి తీసే క్రమంలో రెండు తెగల మధ్య పోరు మొదలవుతుంది. ఆ పోరాటం, దాని ఫలితమే సినిమా అని తెలుస్తోంది. ఇక ట్రైలర్‌లో చూపించినంత వరకు యాక్షన్‌ సన్నివేశాలు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి అని చెప్పాలి.

విల్లు, బరిసెలు, ఈటెలతో యాక్షన్‌ సీక్వెన్స్‌ను భలేగా తెరకెక్కించారు. ఇక ట్రైలర్‌ ఆఖర్లో బ్లాక్‌ పాంథర్‌తో విక్రమ్‌ చేసిన ఫైట్‌ భలేగా ఉంది. ‘చావుని ఎదురించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అని ఆఖరులో చెప్పించారు దర్శకుడు. ఇదంతా చూశాక ‘సినిమా రిలీజ్‌ డేట్‌ చెప్పు’ అని అడగనివారు ఉండరు. అందుకే ఆగస్టులో తీసుకొస్తారు అనే పుకారును మీ ముందుంచుతున్నాం.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus