మార్చిలో ఏర్పడిన కరోనా లాక్ డౌన్ వల్ల.. షూటింగ్ దశలో ఉన్న చాలా సినిమాలు ఆగిపోయాయి. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో.. మళ్ళీ మొదలయ్యాయి. కొంతమంది పెద్ద హీరోల సినిమాలు తప్ప… దాదాపు అన్ని సినిమాల షూటింగ్ లు మొదలైపోయాయి. థియేటర్లు కూడా మెల్ల మెల్లగా ఓపెన్ అవుతున్నాయి. అయితే ఇలా షూటింగ్లను ప్రారంభిస్తున్నారో లేదో నెల రోజుల లోపే షూటింగ్ పూర్తయిపోయింది అంటూ.
గ్రూప్ ఫొటోలతో ప్రకటనలు చేసేస్తున్నారు. అయితే నిజంగానే షూటింగ్లు అన్నీ కంప్లీట్ అవుతున్నాయా? లేక కరోనా భయంతో త్వరత్వరగా ఏదో మమ అనిపించేస్తున్నారా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతోన్న ప్రభాస్.. ‘రాధే శ్యామ్’ చిత్రం ఇటలీ షెడ్యూల్ 2వారాలకే ఫినిష్ అయిపోయిందన్నారు. ఇక నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయిందని తాజాగా ప్రకటించారు. అంతేకాదు శర్వానంద్ ‘శ్రీకారం’, సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’..
ఇలా అన్ని సినిమాల షూటింగ్ లు పూర్తయిపోయాయి అనే ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. అయితే ‘కరోనా కారణంగా 4 నెలల పాటు ఖాళీగా ఉండడంతో…దర్శకనిర్మాతలు పక్కా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని.. రంగంలోకి దిగుంటారు. అందుకే ఇంత త్వరగా పూర్తయిపోతున్నాయి’ అని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బహుశా అది కూడా నిజమే అయ్యుండొచ్చు.