తెలుగులో సరైన స్పోర్ట్స్ డ్రామా ఎప్పుడొచ్చింది అంటే తక్కువ ఎవరూ చెప్పలేరు. మహా అయితే అప్పుడెప్పుడో వచ్చిన “అశ్విని”, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా స్పోర్ట్స్ ను ఒక కీలకాంశంగా వాడుకున్నవే తప్ప, సరైన స్పోర్ట్స్ డ్రామా చిత్రం తెలుగులో రాలేదనే చెప్పాలి. హిందీ, తమిళ, మలయాళ భాషల్లో మాత్రం కోకొల్లలు. ఆ లోటు తీర్చేందుకు వస్తున్న సినిమాలా ఉంది “అర్జున్ చక్రవర్తి”. కబడ్డీ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగులో “కబడ్డీ కబడ్డీ” లాంటి కామెడీ సినిమా, “ఒక్కడు” లాంటి కమర్షియల్ సినిమా వచ్చింది తప్పితే.. కంప్లీట్ గా ఒక సీరియస్ సినిమా అనేది రాలేదు.
ముఖ్యంగా ఇది ఒక బయోపిక్ కావడంతో.. మరింత ఆసక్తికరంగా మారింది. అర్జున్ చక్రవర్తి అనే నిజజీవిత కబడ్డీ ప్లేయర్ ఎదుర్కొన్న ఇబ్బందులు, పోటీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆల్రెడీ ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో దాదాపు 46 అవార్డులు అందుకున్న ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది. అర్జున్ చక్రవర్తి జర్నీ ఏమిటి అనేది ఒక మంచి గ్లింప్స్ ఇచ్చారు టీజర్ లో.అర్జున్ చక్రవర్తిగా నటించిన విజయ రామరాజు చాలా నిక్కచ్చిగా పాత్రలో జీవించాడు అని చెప్పొచ్చు.
ఐపీఎల్ మాయలో పడి అసలే మన జాతీయ క్రీడ హాకీని జనాలు ఎప్పుడో మర్చిపోయారు. ఇక మన రాష్ట్ర క్రీడ అయినటువంటి కబడ్డీని అప్పుడప్పుడు టీవీలో వచ్చే ప్రోకబడ్డీలో చూడడం తప్ప పెద్దగా గుర్తు కూడా ఉండదు. అలాంటి మన మట్టి ఆటను తెలుగు ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసే చిత్రం “అర్జున్ చక్రవర్తి” నిలుస్తుందేమో చూడాలి. ఈ సినిమా కమర్షియల్ హిట్ అవ్వడం కూడా చాలా అవసరం. లేదంటే తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలు ఏమిటి అనే లిస్ట్ తీస్తే.. తిప్పి కొడితే 10 కూడా రావు భవిష్యత్తులో.