ఒకసారి విజయం సాధించిన సినిమాని రీమేక్ చేయడం చాలా సులభం అంటుంటారు కొంతమంది. కొత్త సినిమా చేయడం కంటే ఇదే పెద్ద కష్టమని ఫిలిం మేకర్స్ అభిప్రాయం. అది మరోసారి నిరూపితమైంది. సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే కలిసి నటించిన “అర్జున్ రెడ్డి” సినిమా రికార్డులను తిరగరాసింది. అందుకే ఈ సినిమాని తమిళంలో బాల “వర్మ”గా తెరకెక్కిస్తున్నారు. తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ టీజర్ నిన్న రిలీజ్ అయింది. ఈ వీడియో చూస్తుంటే తమిళ నెటివిటీకి తగినట్లు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి ఇంట్లోని పనిమనిషి పాత్ర నిడివి పెంచినట్లుగా ఉంది. ఈ పాత్రను ఈశ్వరీరావు పోషిస్తున్నారు.
షాలినీ పాండే పాత్రలో మేఘా చౌదరీ నటించింది. ‘అర్జున్’ రెడ్డి సినిమాలో ఉన్నట్లే ఇందులోనూ లిప్‌లాక్స్, ఫైట్లు ఉన్నాయి. కానీ తెలుగు ప్రేక్షకులకు ఈ టీజర్ నచ్చడం లేదు. హీరో అవతారం పై అనేక విమర్శలు వస్తున్నాయి. ధృవ్.. విజయ్ దేవరకొండ గా నటించలేకపోయారని ఆరోపిస్తున్నారు. రీమేక్ చేయడంలో దర్శకుడు బాల విఫలమయ్యారని అభిప్రాయపడుతున్నారు. ఇక సంగీతం కూడా సెట్ కాలేదని అర్జున్ రెడ్డి అభిమానులు చెబుతున్నారు. తమిళ ప్రజలు మాత్రం ఈ టీజర్ ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. మరి సినిమా ఏ మాత్రం విజయం సాధిస్తుందో చూడాలి.