ప్రముఖ దక్షిణాది సినిమాల నిర్మాత, ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎం శరవణన్ (86) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆయన నివాసంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో శరవణన్ 300కుపైగా సినిమాలను నిర్మించారు. AVM స్టూడియోస్‌ను స్థాపించిన దిగ్గజ వ్యవస్థాపకుడు AV మెయ్యప్పన్ కుమారుడే శరవణన్. మెయ్యప్పన్ తమిళ సినిమా మార్గదర్శకుల్లో ఒకరు అని చెప్పా.
ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సినిమా పరిశ్రమకు తన సేవలందించారు. శరవణన్ తన 85 జన్మదినాన్ని నిన్ననే (డిసెంబరు 3) జరుపుకోవడం గమనార్హం. సినిమా రంగంలో రాణించడంతోపాటు 1986లో మద్రాస్ షెరీఫ్‌గా ప్రజలకు సేవ చేశారు. ఇక ప్రస్తుతం ఏవీఎం నిర్మాణ సంస్థను శరవణన్ కుమారుడు గుహన్ నిర్వహిస్తున్నారు.

తెలుగులో ‘సంసారం ఒక చదరంగం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘మెరుపు కలలు’, ‘జెమిని’ వంటి సినిమాలు చేశారు. మొత్తంగా చూస్తే ఆయన నిర్మాణంలో ‘నానుమ్ ఒరు పెన్’, ‘సంసారం అదు మిన్సారం’, ‘శివాజీ: ది బాస్’, ‘వేట్టైకరన్’, ‘మిన్సారా కనవు’, ‘లీడర్’, ‘అయాన్’ లాంటి సినిమాలు వచ్చాయి. శరవణన్ మృతికి దక్షిణ భారత సినిమా ప్రముఖులు, సెలబ్రిటీలు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
