బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలకపాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన చాలా మంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. అంతేకాదు.. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను నిషేధించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. దీనికి కారణమేంటంటే..? రణబీర్ కపూర్ కాళ్లకు షూస్ వేసుకొని ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా.. షూలతోనే గుడి గంట మోగించాడు.
దీంతో ఈ సీన్ పై ఓ వర్గం ప్రేక్షకులు మండిపడ్డారు. ఆలయంలోకి చెప్పులు వేసుకొని ఎలా వెళ్తారంటూ మండిపడ్డారు. తాజాగా ఈ వివాదంపై ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘రణబీర్ కాళ్లకు షూ వేసుకొని గుడి గంట మోగించడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక భక్తుడిగా సినిమా దర్శకుడిగా అసలేం జరిగిందో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.
రణబీర్ కాళ్లకు షూ వేసుకొని ఆలయంలోకి అడుగుపెట్టలేదు. దుర్గాదేవి పూజామండపంలోకి వెళ్లాడు. 27 ఏళ్లుగా మా కుటుంబం దుర్గా పూజను నిర్వహిస్తోంది. నాకున్న అనుభవంతో చెబుతున్నా.. మండపంలోకి కాళ్లకు చెప్పులు వేసుకొనే వెళ్తాం.. కానీ అమ్మవారి ముందుకు వెళ్లేప్పుడు మాత్రం వాటిని పక్కన విడిచి దర్శనం చేసుకుంటాం. ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ లో ఆ సీన్ లో కూడా జరిగిందదే. భారతీయ సంస్కృతిని చాటి చెప్పడానికే ఈ సినిమా తీశాం. అంతేతప్ప ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదు’ అని చెప్పుకొచ్చారు.