‘బాహుబలి’ (Baahubali) సిరీస్ సినిమాలు సినీ ప్రియులను ఎంతగా అలరించాయో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడో ‘బాహుబలి’ వస్తే చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మూడో పార్టు వచ్చే అవకాశంలేదు. అయితే ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో ఓ యానిమేషన్ సినిమా రూపొందించారు. మే 17 నుండి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. వారానికొక ఎపిసోడ్ చొప్పున అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రచారానికి టీమ్ ఈటీవీ విన్ హిట్ సిరీస్ ‘#90s’ (90’s – A Middle-Class Biopic) కాన్సెప్ట్‌ను వాడుకుంటోంది.
ఆ సిరీస్ ఫస్ట్ టైమ్ అలా చేసింది అని చెప్పం కానీ.. రీసెంట్ సినిమా కాబట్టి ఆ రిఫరెన్స్ వాడాం అంతే. ఆ సిరీస్‌ను ఈటీవీ విన్ టీమ్ ‘తొలి ఎపిసోడ్’ ఫ్రీ అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లింది. భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ తొలి ఎపిసోడ్‌ను ఉచితంగా చూసే అవకాశాన్ని హాట్ స్టార్ కల్పించింది. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది కూడా.
ఇక మిగిలిన ఎపిసోడ్‌లను చూడాలంటే హాట్‌స్టార్‌కు లాగిన్ అవ్వాల్సిందే. అంటే పేమెంట్ చేయాల్సిందే. మరి #90s తరహా ప్రచారం సిరీస్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్‌కు జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియాతో కలిసి రాజమౌళి (S. S. Rajamouli) , శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) నిర్మించారు. ఈ సిరీస్ ‘బాహుబలి’కి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కాదు.
ఆ రెండు భాగాలకు మధ్యలో జరిగే కథ ఇది. అంతేకాదు ‘బాహుబలి’ ప్రపంచాన్ని మరింత విస్తరింపజేసే ప్లాన్స్ కూడా ఉన్నాయట. ఈ యానిమేటెడ్ సిరీస్ అనేది తమ ఆలోచనలకు స్టార్టింగ్ అని, ఇంకా ఇలాంటి మరికొన్ని ఆసక్తికర ప్లాన్స్ ఉన్నాయని టీమ్ అంటోంది. అవేంటి అనేది త్వరలో చెబుతాం అంటోంది. ఇప్పటికైతే ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి మరి.