వెండి తెర ఆవిష్కృతమైన తొలి రోజుల్లో సినిమాలను మళ్లీ మళ్లీ రిలీజ్ చేసేవారు. తెలుగులో తొలి తరం హీరోల చిత్రాలు సైతం మళ్లీ విడుదలై విజయం సాధించాయి. నిర్మితమయ్యే చిత్రాలు పెరగడం, బుల్లితెరలో మూవీలు ప్రసారం కావడం, డీవీడీ లు అందుబాటులోకి రావడం.. ఇవన్నీ థియేటర్లలో సినిమాలను మళ్లీ రిలీజ్ కాకుండా అడ్డుకున్నాయి.
వీటన్నింటిని ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన కళా ఖండం బాహుబలి – ది బిగినింగ్ ఒక్క వేటుతో నరికేసింది. ఈ ఫిల్మ్ విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నాఆసక్తి మాత్రం తగ్గలేదు. బాహుబలి ని మరోసారి థియేటర్లలో చూడాలని భావించే వారి సంఖ్య పెరుగుతోంది. కేరళలో అయితే ఈ నెంబర్ చాలా ఎక్కువగా ఉందంట. అందుకే ఆ రాష్ట్ర డిస్ట్రిబ్యూటర్ గ్లోబల్ యునైటెడ్ మీడియా వారు కేరళలో బాహుబలి మళయాళం వెర్షన్ ను మరోసారి విడుదల చేయాలని భావిస్తున్నారు.
జూలై రెండోవారంలో బాహుబలిని మళ్లీ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు. అక్కడగాని మంచి కలక్షన్ వస్తే తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ చిత్రం రీ రిలీజ్ కావడం ఖాయం.