టీవీ 9 వర్సెస్ విశ్వక్‌సేన్ వ్యవహారంలో ప్రముఖ మానవహక్కుల కార్యకర్త బాబు గోగినేని మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఫేస్‌బుక్‌లో ఆయన తాజాగా కొన్ని ఫొటోలు పోస్ట్ చేస్తూ తన ప్రశ్నల్ని సంధించారు. ఆ ఫొటోలు చూస్తే అచ్చంగా మొన్నీమధ్య విశ్వక్‌సేన్ టీమ్ సినిమా గురించి చేసిన ప్రాంక్ వీడియోలాగే ఉంది. వీళ్లు చేసింది తప్పే, వాళ్లు చేసిందీ తప్పే అంటూనే.. విశ్వక్‌సేన్ చేసిన పనీ తప్పే అని చెప్పారు. ఆయన తన ఎఫ్‌బీ పోస్ట్‌లో ఏమేం చెప్పారంటే?
“మా అన్నొత్తేనే ఉంటా లేకపోతే నేను ఉండను!” అని నీళ్లతో నిండిన పెట్రోల్ క్యాన్ పట్టుకుని రోడ్డు పక్కన కొంతమంది మిత్రులు సూసైడ్ ప్రాంక్ స్కిట్ చేశారు. ఆ స్కిట్‌ను టీవీ9 సరదాగా ప్రసారం చేసింది. ఆ దృశ్యాలే ఇవీ. ఈ సన్నివేశాలు అప్పుడు ఎవరికీ సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్ కాకపోవడం కొసమెరుపు. విశ్వక్ సేన్ చేసింది ఇదేనా? ఆ పని సరికాదు.. ఇప్పుడు ఈ పనీ సరికాదు. ఒకటి కరెక్ట్ అనుకొని, రెండోది కాదు అనడం నిజాయతీ అవుతుందా? కానివ్వండి, వీడియోలు డిలీట్ చేసినవాడిదే రాజ్యం అంటూ ఎఫ్‌బీ పోస్ట్‌లో రాసుకొచ్చారు బాబు గోగినేని.
టీవీ9 దేవీ నాగవల్లి, విశ్వక్ సేన్ విషయంలో బాబు గోగినేని స్పందించడం ఇది రెండోసారి. ఇప్పటికే ఓసారి ఎవరు తప్పు చేశారు, ఎవరు సారీ చెప్పాలి అంటూ ఓ పెద్ద పోస్టే పెట్టారు. ఇప్పుడు రాసింది రెండోది. అంతకుముందు పోస్ట్‌లో ఏం చెప్పారంటే…
‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ప్రచారం కోసం విశ్వక్‌సేన్ టీమ్ చేసిన ప్రాంక్ వీడియో గురించి, దాని వల్ల రేగిన వివాదం గురించి మాట్లాడుతూ విశ్వక్‌సేన్‌ను దేవి పాగల్‌సేన్ అని, డ్రిప్రెష్‌డ్ అంటూ సంభోదించారు. ఇది ఇండియన్ మెంటల్ హెల్త్ యాక్ట్‌ని ఉల్లంఘించనట్లే. దేవి అలా మాట్లాడుతుండటంతో విశ్వక్‌సేన్ ఆమెను వారించారు. మీరు మాటల్ని అదుపులో పెట్టుకోండని సూచించారు. తన డ్రిపెషన్ గురించి మాట్లాడే హక్కు లేదు అని కూడా పదే పదే గుర్తు చేశారు. దీనిపై విశ్వక్‌సేన్ పరువు నష్టం కేసు వేయొచ్చు.
ఈ వ్యవహారం తర్వాత.. ఆమె వాళ్ల హెడ్ రజనీకాంత్ వద్దకు వెళ్లి.. విశ్వక్‌సేన్ భాష బాలేదు అని చెప్పారు. తన కుటుంబ సభ్యులు చూస్తున్నారు అని, ఆయన మాటలు సమంజసం కాదని కూడా చెప్పారు. అయితే అంతకుముందు విశ్వక్‌సేన్‌పై ఆమె ఎలాంటి మాటలు మాట్లాడారు అనేది ఆలోచించాలి. గెటవుట్ అని అనడం ఎంతవరకు సబబు. విశ్వక్‌సేన్ ఆ నాలుగక్షరాల మాట అనేముందే ఆమె గెటవుట్ అన్నారు. ఈ విషయంలో విశ్వక్‌సేన్ ఇటీవల క్షమాపణ కూడా కూడా చెప్పారు. కానీ అతని మానసిక అనారోగ్యం గురించి చర్చలో లేవనెత్తిన వ్యక్తి దేవీ నాగవల్లి. అక్కడ విశ్వక్‌సేన్ ఆబ్జెక్ట్ అయ్యారు.
ఒక వ్యక్తిని లేడీ యాంకర్ / జర్నలిస్ట్ ఇలా ‘మీకు పిచ్చి’ అనే అర్థం వచ్చేలా, డిప్రెషన్‌లో ఉన్నారా? అని అర్థం వచ్చేలా మాట్లాడితే ఏం చేయాలి. స్టూడియోలో విశ్వక్‌సేన్ విషయంలో దేవీ నాగవల్లి చేసిన పనికి.. ఆమెకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలి. దాంతోపాటు ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రవర్తించినందుకు విశ్వక్‌సేన్‌కు కూడా సారీ చెప్పాలి.