మెగా అభిమానులకు జూలై ఎండింగ్ నుండి పండగలాంటి సీజన్ మొదలు కానుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మెగా సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘బ్రో’ సినిమా జూలై 28 న విడుదల కాబోతుంది. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నిర్మిస్తోంది. అటు తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ ఆగస్టు 11న విడుదల కాబోతోంది.
దీని తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రం ఆగస్టు 18 న రిలీజ్ కాబోతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే అభిమానుల్లో ఓ రేంజ్ జోష్ ఏర్పడాలి. కానీ అలాంటిదేమి జరగడం లేదు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పక్కా క్లాస్ మూవీ. తమిళంలో రూపొందిన ‘వినోదయ సీతమ్’ కి రీమేక్.
ఓ రకంగా ‘గోపాల గోపాల’ లాంటి సినిమా అనమాట. కాబట్టి పవన్ ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎలిమెంట్స్ ఇందులో ఉండకపోవచ్చు అని అంతా అనుకుంటున్నారు. ఇక ఆగస్టు 11 న రిలీజ్ అవుతున్న ‘భోళా శంకర్’ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. అది హిట్ ట్రాక్ రికార్డు లేని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండటం, టీజర్ కూడా పరమ రొటీన్ గా ఉండటంతో ఆ సినిమా పై అంచనాలు ఏర్పడలేదు.
సినిమాకి నెగిటివ్ టాక్ కనుక వస్తే.. ‘ఆచార్య’ ని మించి డిజాస్టర్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి అని అంతా భయపడుతున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆది కేశవ’ ఆగస్టు 18 న రిలీజ్ అవుతున్నప్పటికీ ఆ సినిమా పై కూడా అంచనాలు లేవు. అందుకు కారణం ‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ ఇచ్చింది లేదు. అందుకే మెగా హీరోల సినిమాల పై అభిమానులకి కూడా నమ్మకం లేనట్టే కనిపిస్తుంది.