కాంట్రవర్శీ – సినిమా… ఈ రెండూ భలే ఉంటాయి అసలు. కొన్ని సినిమాలు తీస్తే కాంట్రవర్శీ అవుతుంది. కొన్ని కాంట్రవర్శీలు సినిమాలు అవుతుంటాయి. అలాగే కాంట్రవర్శీ ఉంటే సినిమా హిట్ అవుతుంది. ఈ క్రమంలో కొంతమంది హీరోలు, దర్శకనిర్మాతలు కాంట్రవర్శీ కోసం పెద్ద ప్లాన్‌లే వేశారు, వేస్తుంటారు కూడా. అయితే చిన్న మాట పెట్టి కాంట్రవర్శీ సాధించి, ఆ తర్వాత విజయాలు సాధిస్తున్నారు మన టాలీవుడ్‌లో కొంతమంది. దీనికి కారణం డిస్కషన్.
అవును, సినిమా ట్రైలరో, టీజరో వచ్చినప్పుడు అందులో కంటెంట్ ఏముంది అనే ప్రశ్న ముందు వస్తుంది. కానీ కొంతమంది సినిమాలు మాత్రం అందులో బూతు ఏముంది, అర్ధ బూతు ఏముంది అనే చూస్తుంటారు. లేదంటే అలా చూసేలా చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ బూతు పదం దాదాపుగా ఉన్న టీజర్ ఒకటి వచ్చింది. ఆ సినిమాను ‘గం గం గణేషా’. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులోనే బూతుపదం కలిపేశారు.
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. మ్యాగ్జిమమ్ క్రెడిట్ వైష్ణవి చైతన్య సాధించినా… ఆనంద్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అదే జోరులో గతంలో చేసిన ‘గం గం గణేషా’ సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. దాని కోసం ఓ టీజర్‌ను రిలీజ్‌చేశారు. క్రైమ్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. అయితే సోషల్ మీడియాలో చివర్లో వచ్చిన డైలాగే వైరల్ అయ్యింది.
‘చెప్పింది చెప్పినట్లు చేస్తే.. మీ వాటాలు మీ చేతిలో పెడతా’ అని విలన్ డైలాగ్ చెబితే.. హీరో పక్కనున్న కమెడియన్ ఆశ్చర్యపోయి చూస్తారు. వెంటనే హీరో ‘అది వాటాలు’ అని స్ట్రెస్ చేసి మరీ చెబుతాడు. అక్కడ క్లియర్‌గా ఏం చెప్పాడో లేకపోయినా వెబ్ సిరీస్‌ల కాలంలో ఆ డైలాగ్ కి అర్థం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదొక్కటే అని కాదు. మొన్నామధ్య వచ్చిన ‘రంగబలి’ సినిమాలో అతుల్, సంక డైలాగ్‌లు ఇలాంటివే.
మాస్ కా దాస్ అని పిలిపించుకునే విశ్వక్ సేన్ ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో కూడా షేపవుట్ డైలాగ్ ఉంది. ఇక ‘అర్జున్ రెడ్డి’ డైలాగ్‌ల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా సినిమా టీజర్, ట్రైలర్‌లో బూతు, సెమీ బూతు పెట్టేసి చర్చకు దారి తీస్తున్నారు అని చెప్పొచ్చు. అయితే ఈ మాటను ఆయా సినిమా టీమ్ ఒప్పుకోకపోవచ్చు.