‘మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వివాదం మరింతగా రెట్టింపు అవుతున్నట్టు కనిపిస్తుంది. కొంతమంది రాజీ పడడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మరికొంతమంది వివాదాస్పద కామెంట్లు చేస్తూ… పక్కవారిని రెచ్చగొడుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ ‘మా’ వివాదం పై స్పందించి సంచలన కామెంట్లు చేశారు. బాలయ్య మాట్లాడుతూ.. ” ‘మా’ ఎన్నికల విషయంలో లోకలా, నాన్ లోకలా? అనే విషయాన్ని నేను పరిగణలోకి తీసుకోను. మనది గ్లామర్ ఫీల్డ్ కదా అని.. ప్రతీ సమస్యని బహిరంగంగా చర్చించుకోవడం కరెక్ట్ కాదు.
నిధుల సేకరణ కోసం తెగ తిరిగామని. చాలా వరకు సేకరించామని ఇప్పటివరకు చేసిన వాళ్ళు చెబుతున్నారు. మరి ఆ డబ్బంతా ఏం చేశారు. మా భవనం నిర్మాణ కార్యక్రమాలు ఎందుకు మొదలవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు కదా, మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా? అందరం కలిస్తే ఇంద్రభవనమే నిర్మించొచ్చు. మా బిల్డింగ్ నిర్మించడానికి మంచు విష్ణు ముందుకు వస్తే నేను సహకరిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
అయితే ఇక్కడ భవనం నిర్మాణం సంగతి ఒక్కటే కాదు.. ఇన్కమ్ జెనరేషన్ కు సంబంధించి ఎటువంటి పనులు చేపట్టారు.. అనేది ముఖ్యమని గతంలో చిరంజీవి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏమైనా బాలయ్య చేసిన ఈ కామెంట్లకి ఇండస్ట్రీలోని పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి..!