టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల క్రేజ్ మళ్ళీ మొదలైంది. ఈ క్రేజ్ ని పునః స్వాగతం పలికిన వెంకటేష్ తాజాగా తేజ దర్శకత్వంలో రానున్న చిత్రంలోనూ మరో స్టార్ హీరో నటించడానికి రెడీ అవుతున్నారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ తో ఓ మల్టీ స్టారర్ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో అందరిలోనూ ఉత్సాహం వచ్చింది. ఓ వైపు నితిన్, శర్వానంద్ లు కలిసి ఓ చిత్రం చేయబోతుండగా, మరో వైపు సాయిధరమ్ తేజ్ – వరుణ్ తేజ్ లతో మల్టీ స్టారర్ మూవీకి పనులు మొదలయ్యాయి. ఎవరూ ఊహించని కాంబినేషన్ ని బోయపాటి శ్రీను సెట్ చేశారు. మాస్ హీరో బాలకృష్ణ, క్లాస్ హీరో మహేష్ బాబు లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేశారు. బాలయ్యకి బోయపాటి అంటే చాలా ఇష్టం. తనకి పూర్వ వైభవం తీసుకొచ్చిన డైరక్టర్ కావడంతో అతని మాట కాదనరు.
ఆ ఉద్దేశంతోటే బాలయ్యకి కథ చెప్పి ఒప్పించినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అదే విధంగా బోయపాటితో మహేష్ ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నారు. అతను చెప్పిన మల్టీ స్టారర్ కథ బాగుండడంతో మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం మహేష్ ఫుల్ బిజీ. కొరటాల శివతో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మూవీ మొదలుకానుంది. ఈ రెండు సినిమాల తర్వాత బాలకృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించడానికి 14రీల్స్ సంస్థ సిద్ధంగా ఉంది.