స్టార్ హీరో బాలకృష్ణ ప్రభాస్ కాంబినేషన్ అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ షూటింగ్ మూడు వారాల క్రితమే పూర్తైంది. ఈ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూడగా ప్రస్తుతం ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ లో అటు బాలయ్య ఇటు ప్రభాస్ ఊహించని స్థాయిలో ఎనర్జీతో కనిపించారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బాలయ్య ప్రశ్నలు అడిగిన విధానం ప్రభాస్ జవాబులు చెప్పిన విధానం బాగుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అయినప్పటికీ బాలయ్యను డార్లింగ్ సార్ అని సంబోధిస్తూ ప్రభాస్ చూపించిన గౌరవానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ పెళ్లి గురించి ఇచ్చిన వివరణ సైతం నచ్చింది. అయితే ప్రభాస్ పెళ్లి ఎందుకు ఆలస్యమవుతోందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. ప్రభాస్ కృతిసనన్ మధ్య ఏదో ఉందని జరిగిన ప్రచారానికి కూడా ఈ ఎపిసోడ్ ద్వారా చెక్ పడింది.
చరణ్ ఫోన్ కాల్ ఈ ఎపిసోడ్ కు హైలెట్ గా నిలిచింది. బ్రో కోడ్ అని చెబుతూ ప్రభాస్ తనకు చరణ్ కు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పారు. కొరటాల శివకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి ఆయన స్టార్ డైరెక్టర్ కావడంలో ప్రభాస్ కీలక పాత్ర పోషించారు. ప్రభాస్ అభిమానులకు ఈ ఎపిసోడ్ ఎంతగానో నచ్చేసింది. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ ల గురించి అప్ డేట్స్ తెలుసుకోవచ్చని భావించిన అభిమానులకు మాత్రం ఒకింత నిరాశ ఎదురైంది.
మరింత ఎక్కువ నిడివితో ఈ ఎపిసోడ్ రిలీజై ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ప్రభాస్ సినిమాల అప్ డేట్స్ తెలుస్తాయేమో చూడాలి. ఈ ఒక్క ఎపిసోడ్ తో ఆహా ఓటీటీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.