తెలుగు సినిమాకు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చాలా ఏళ్లుగా సేవ చేస్తున్నారు. కొంతమంది హీరోలు చేయడానికి వెనుకంజ వేసిన పాత్రలు, ఒప్పుకోవడానికి భయపడ్డ కథలను కూడా బాలయ్య చేశారు. చేయడమే కాదు మెప్పించారు కూడా. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఆయన.. హీరోగా 40 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. అలాంటి ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుండి మొన్నీమధ్య వరకు పురస్కార గౌరవం దక్కలేదు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు అవార్డు వచ్చింది.
ఈ క్రమంలో ఆయనకు ఈ అవార్డు రావడంలో ఆలస్యమైంది. నిజానికి ఆయనకు ఎప్పుడో అవార్డు రావాల్సింది. పద్మభూషణ్ అవార్డు గౌరవం అందుకున్న మిగిలిన నటులతో పోలిస్తే ఆయనకు రావడం లేటే అని కామెంట్ల సారాంశం. కొంతమంది అయితే ఇప్పటికైనా వచ్చింది అదే సంతోషం అని అన్నారు. ఆయనను నటుడిగా మాత్రమే చూసి ఉన్నారు ఇన్నాళ్లు చూసినట్లున్నారు.. కానీ ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు అని ఆలస్యంగా తెలిసిందేమో అనే కౌంటర్లు కూడా ఆ మధ్య వచ్చాయి.
ఈ మాటలు బాలకృష్ణ వరకు వెళ్లాయే ఏమో.. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రెస్ మీట్‌లో ఆయన రియాక్ట్ అయ్యారు. నాకు పద్మభూషణ్ పురస్కారం వచ్చాక చాలా మంది ‘మీకీ అవార్డు కాస్త లేటుగా వచ్చినట్లుంది’ అని అన్నారు. కానీ నాకు ఈ పురస్కారం సరైన సమయానికే వచ్చిందని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను వరుసగా విజయవంతమైన సినిమాలు చేస్తున్నాను. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
‘అన్‌స్టాపబుల్’ షో ద్వారా దేశంలోనే నంబర్ వన్ షోగా నిలిచాను. ఈ షో ద్వారా రెండు తరాలకు కనెక్ట్ అయిపోయా. ఓవైపు నా కొడుకుతో పాటు మనవళ్లకు కనెక్ట్ అవగలుగుతున్నా. ఈ పనులన్నీ నేను ఇదివరకు చేయలేదు. ఆ లెక్కన ఇప్పుడు ఇవన్నీ చేశాక అవార్డు రావడం సరైనదే కదా అని ప్రశ్నించారు బాలయ్య. మరి ఆయన స్పందనతో ‘పద్మ భూషణ్’ చర్చ ఆగిపోతుందేమో చూడాలి.