అమెజాన్ ప్రైమ్‌లో ‘హత్య’ (Hathya) అనే ఓ సినిమా ఉంది మీరు చూసే ఉంటారు. లేదంటే మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఆ సినిమా డిస్క్రిప్షన్‌లో ఆ సినిమా వీఎస్ దయానంద్ రెడ్డి అనే సీనియర్ రాజకీయ నాయకుడి హత్య నేపథ్యంలో రూపొందింది అని రాసి ఉంటుంది. అయితే ఇది వైఎస్‌ఆర్‌సీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో సాగిన సినిమా అని అందరికీ తెలుసు. సినిమా చూసిన వాళ్లంతా ఇదే మాట అంటారు కూడా. ఈ ఏడాదే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది.
వివేకా హత్య విషయంలో కొంతమందిని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన సినిమా ఇది అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి ఇప్పుడు వేరే డిస్కషన్‌కు తెర లేపారు. అదే ఈ సినిమా నిర్మాతలు ఎవరు అని. మామూలుగా అయితే ఈ సినిమా స్ట్రీమ్ అవుతున్న అమెజాన్ ప్రైమ్‌లో కానీ, పోస్టర్ల మీద కానీ ఎస్. ప్రశాంత్ రెడ్డి అనే ఉంది. కానీ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న సునీల్ యాదవ్ మాత్రం ఈ సినిమాకు (Hathya) వైఎస్‌ఆర్‌సీపీ నేతలే నిర్మాతలు అని అంటున్నాడు.
ఈ మేరకు ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సినిమాలో తన తల్లిని అత్యంత ఘోరంగా చూపించారు అని అన్నారాయన. వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న కొంతమందిపై నిందలు వేసేలా ఆ సినిమా ఉంది అనేది సునీల్ వాదన. అలాగే ఆ కొంతమంది కుటుంబసభ్యులను కూడా దారుణంగా చిత్రీకరించారు అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో అవినాష్ రెడ్డి సహా ఇతర వ్యక్తుల పాత్రలు లేవు అని విమర్శలు వస్తున్నాయి. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం, సాక్ష్యాలు మాయం చేయడం లాంటి వివరాలు లేవు.
దీంతో వైఎస్ జగన్‌కు చెందిన పత్రికలోని కథనాలకు ఓ దృశ్యరూపం ఇచ్చేలా సినిమా (Hathya) ఉందని.. విమర్శలు వస్తున్నాయి. ఆఖరిగా వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వైపే వేళ్లన్నీ వెళ్లేలా సినిమాలో చూపించారు అనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలే డబ్బులు పెట్టారని సునీల్ యాదవ్ చేస్తున్నా ఆరోపణల విషయంలో నిజాలున్నాయనే భావన కలగడం సహజం.