తొలి సినిమా ఓటీటీలో వచ్చింది భారీ విజయం దక్కించుకుంది. రెండో సినిమా నేరుగా థియేటర్లలోకి వచ్చింది అప్పుడూ సేమ్ రిజల్ట్ రిపీట్. దీంతో ఆ సినిమాల నుండి వస్తున్న మూడో సినిమా మీద అందరికీ అంచనాలు ఉన్నాయి. అయితే నిజానికి ఆ సినిమా మూడో ప్రాజెక్ట్ కాదు.. అదే తొలి సినిమా అని తెలిస్తే మీకెలా అనిపిస్తుంది. ఇలా కూడా జరుగుతుందా అని అడిగితే.. జరిగింది అనే చెప్పాలి. ఇలా వియర్డ్ ఫీలింగ్‌ను ప్రస్తుతం అనుభవిస్తున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath). అవును ‘పొలిమేర’ (Maa Oori Polimera) దర్శకుడి గురించే ఇదంతా.
‘మా ఊరి పొలిమేర’ అంటూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (ఇప్పుడు జియో హాట్ స్టార్ అనుకోండి)లో 2021లో వచ్చారు అనిల్ విశ్వనాథ్. కరోనా – లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) అంటూ రెండేళ్ల క్రితం అంటే నేరుగా థియేటర్లలోకి వచ్చారు. ఈ సారి కూడా తొలి సినిమాకు వచ్చిన ఫలితమే వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ విశ్వనాథ్‌కు మంచి పేరు వచ్చింది. ఆయన టేకింగ్‌ను చాలామంది మెచ్చుకున్నారు.
అలాంటి దర్శకుడి నుండి త్వరలో ‘28 డిగ్రీస్ సీ’ (28 Degree Celsius) అనే సినిమా రాబోతోంది. ఇద్దరు వైద్య విద్యార్థుల ప్రేమకథతో రూపొందిన చిత్రం ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలతో పాటు సూపర్ నేచురల్ షేడ్స్ ఉంటాయి అని ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. నవీన్ చంద్ర (Naveen Chandra) , షాలినీ వడ్నికట్టి (Shalini Vadnikatti) జంటగా నటించిన ఈసినిమాను ఏప్రిల్ 4న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ‘పొలిమేర’ సిరీస్ విజయాల తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.
ఈ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath) మీడియాతో మాట్లాడారు. దర్శకుడిగా ఇది నా తొలి సినిమా అని చెప్పిన ఆయన 2017లో ప్రారంభించి 2020 మేలో విడుదల చేయాలని అనుకున్నామని షాకింగ్ విషయం చెప్పుకొచ్చారు. కొవిడ్ పరిస్థితుల వల్ల సినిమాను బయటకు తీసుకురాలేకపోయామని తెలిపారు. సినిమా ఆగిపోయినప్పుడు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. సినిమాలో తాను కూడా నిర్మాణ భాగస్వామినని, అందుకే ఏం చేయాలో తెలియక ఓసారి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా అని తెలిపారు.