మూడు సంవత్సరాలకు (2014, 15,16) ఆంద్రప్రదేశ్ నంది అవార్డుల ప్రకటనపై వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. లెజెండ్ సినిమాకి అవార్డులు రావడంపై కొంతమంది దర్శకులు, నిర్మాతలు అవార్డుల కమిటీని తప్పు పట్టారు. ఈ అవార్డుల సెలక్షన్స్ వెనుక బాలకృష్ణ హస్తం ఉందని ఆరోపించారు. వర్మ అయితే టీడీపీ నేతలు ఈ అవార్డులు పంపిణీ చేసినట్టుగా రీమిక్స్ పాట కూడా రిలీజ్ చేశారు. ఈ విమర్శలపై బాలకృష్ణ నేడు స్పందించారు. “లెజెండ్ మామూలు టైటిల్ కాదు.
లెజెండ్ పై అప్పుడు ఎన్ని కాంట్రవర్సీలు ఎన్ని వచ్చాయో మీకు తెలుసు. సమిష్టి కృషితోనే లెజెండ్ సినిమాకి తొమ్మిది అవార్డులు వచ్చాయి. మాటలతో కాదు.. చేతలతో చూపించిన సినిమా లెజెండ్. అవార్డు వచ్చిన వారందరికీ అభినందనలు” అని నవ్వుతూ చెప్పారు. అలాగే ‘లెజెండ్’ సినిమాకి నంది అవార్డులు రావడంపై బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి స్పందించారు. తన తండ్రి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం రావడం తనకెంతో సంతోషంగా ఉందని నారా బ్రాహ్మణి అన్నారు.
హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఆమె శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరంలో మాట్లాడారు. నంది అవార్డులు వివాదంపై విలేకర్లు ప్రశ్నించగా.. దానిపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్నారు.