నారా లోకేష్ తో పాటు యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో అతన్ని వెంటనే కుప్పంలో కేసి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అయితే పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే అతన్ని బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. గత వారం రోజుల నుండి అతను హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. ఇంకా కోలుకుంది లేదు. అయితే ప్రమాదం తప్పింది అని డాక్టర్లు చెబుతున్నారు.
నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ… తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పటి నుండి ఆసుపత్రిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ప్రతిక్షణం తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులను ఆరాతీస్తున్నాడు. తారకరత్న ఫ్యామిలీకి ధైర్యం చెబుతూ అతనికి.. మద్దతుగా కూడా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం బాగు కోసం మరో అడుగు ముందుకేశాడు బాలయ్య. తారకరత్న త్వరగా కోలుకోవాలని మృత్యుంజయ ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించాలని నిర్ణయించుకున్నాడు. చిత్తూరు జిల్లాలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగించాలని బాలయ్య డిసైడ్ అయ్యి తన పీఏ రవికి ఆర్డర్ వేశాడట.
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో ఈ ఆలయం ఉంది. బాలకృష్ణ ఆల్రెడీ తారకరత్న కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వినికిడి. అఖండ జ్యోతి కూడా వెలిగించారట. మొదట నుండి తారకరత్న అంటే బాలయ్యకు ప్రత్యేకమైన ఇష్టం. తారకరత్న కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా అఖిలా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు… కుటుంబం అతన్ని దూరం పెట్టింది. అటు తర్వాత తారకరత్నని కుటుంబానికి దగ్గర చేసింది బాలయ్యే.
అంతేకాదు అతని కెరీర్ ను చక్కదిద్దే ప్రయత్నం కూడా చేశాడు. ‘వారాహి’ బ్యానర్ వారు నిర్మించే సినిమాల్లో తారకరత్నకు అవకాశం కల్పించింది కూడా బాలయ్యే. అందుకే బాబాయ్ కోసమైనా తారకరత్న కోలుకోవాలని అభిమానులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.