నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ గారి మరణ వార్తను కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఆ మహానుభావుణ్ణి కడసారి చూసి నివాళులు అర్పించడానికి తెలుగు పరిశ్రమంతా కదలి వచ్చింది.. సూపర్ స్టార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారంతా.. సినీ పరిశ్రమతో పాటు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని పద్మాలయా స్టూడియోలో ఉంచారు.. కృష్ణ గారు మరణించిన రోజు రావడానికి వీలుపడక దూరప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు నేడు హైదరాబాద్ చేరుకుని..
శ్రద్ధాంజలి ఘటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.. మహేష్, నమ్రతల పిల్లలు గౌతమ్, సితార కూడా వచ్చారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, కృష్ణ గారికి నివాళులు అర్పించి.. మహేష్ కుటుంబ సభ్యులను పలకరించారు.. నందమూరి బాలకృష్ణ, సతీమణి వసుంధర, పెద్ద కుమార్తె నారా బ్రహ్మిణిలతో కలిసి వచ్చారు. శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత కుటుంబసభ్యులందరినీ, వాళ్ల బంధువుల్లో తనకు పరిచయం ఉన్నవాళ్లని పలకరిస్తూ.. తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు బాలయ్య..
ఒకే ఏడాదిలో అన్న, తల్లీ, తండ్రిని కోల్పోయిన మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. నిన్నటి నుండి ఆయన పరిస్థితి ఎలా ఉందనేది అందరూ చూస్తూనే ఉన్నారు. పుట్టెడు దు:ఖంలోనూ మహేష్ బాబుతో నవ్వించారు నటసింహ.. బాలయ్య బాబు, మహేష్ బాబు, తనయుడు గౌతమ్, బావ గల్లా జయదేవ్ కలిసి చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటించుకుంటున్న పిక్స్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..
సాధారణంగా బాలయ్య బాబుది కల్మషం తెలియని నవ్వు, ఆయన మనసు బంగారం అని అంటుంటారు.. ‘‘ఇంత శోకంలో ఉన్న మహేష్ చేత కాసేపు నవ్వించావ్.. థ్యాంక్యూ బాలయ్య’’ అంటూ నందమూరి, ఘట్టమనేని ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ షూటింగ్ నుండి హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం.. నందమూరి తారక రత్న, నటుడు రఘబాబు తదితరులు కూడా కృష్ణ గారికి నివాళులు అర్పించారు..