‘జబర్దస్త్’ వంటి బుల్లితెర కామెడీ షోల ప్రభావం వల్ల కామెడీ కోసం జనాలు థియేటర్ల వరకు వెళ్లడం తగ్గించేశారు. ఈ నేపథ్యంలో కామెడీ సినిమాలకు చాలా వరకు కాలం చెల్లిపోయిందనే చెప్పాలి. అయితే సంపూర్ణేష్ బాబు మాత్రం స్పూఫ్ కామెడీ సినిమాలు చేస్తూ జనాలను ఆకర్షిస్తున్నాడు. టైం పాస్ కోసం అయినా ఇతని సినిమాలకు వెళ్లాలని జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇతను నటించిన ‘హృదయకాలేయం’ ‘కొబ్బరి మట్ట’ వంటి సినిమాలు బాగానే కలెక్ట్ చేసాయి. ఇదే కోవలో ఇతని నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బజార్ రౌడీ’. ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. మరి సంపూ గత సినిమాల స్థాయిలో ఈ ‘బజార్ రౌడీ’ మెప్పించిందా లేదా విషయాన్ని తెలుసుకుందాం :
కథ: కాళేశ్వర్ (సంపూర్ణేష్ బాబు) పుట్టడంతోనే అతని తండ్రి చంద్రశేఖర రావు(నాగినీడు) కి బాగా కలిసొస్తుంది.అయితే కాళేశ్వర్ స్కూల్లో తోటి స్టూడెంట్ ను గాయపరుస్తాడు. దీంతో పిల్లలకి క్రమ శిక్షణ కనుక లేకపోతే తనకి వచ్చిన అదృష్టం దురదృష్టంగా మారే ప్రమాదం ఉందని భయపడి కొడుకుని చిన్న చిన్న తప్పులకి కూడా చితక్కొడుతూ ఉంటాడు చంద్రశేఖర రావు.ఇక తండ్రి పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక ఇంటి నుండీ పారిపోతాడు కాళేశ్వర్.
అయితే చంద్రశేఖర రావు బావమరుదలు అతని ఆస్తిని కొట్టేయాలని ప్లాన్లు వేస్తుంటారు.ఈ క్రమంలో ఓ డూప్ ను తీసుకొచ్చి చంద్రశేఖర రావు కొడుకుగా నమ్మించి మోసం చేయాలని భావిస్తారు. మరోపక్క కాళీ పెద్దయ్యి రౌడీగా మారతాడు. అనుకోకుండా చంద్రశేఖర రావు బావమరుదలు.. అతని ఒరిజినల్ కొడుకు కాళేశ్వర్ నే డూప్ గా యాక్ట్ చేయమని తీసుకెళ్తారు. చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: సంపూర్ణేష్ బాబుకి ఈ టైపు పాత్రలు కొత్తేమీ కాదు. అందుకే అతను ఎంతో ఈజ్ తో చేసాడు.బొబ్బిలిపులి గెటప్ లో సంపూ ఎన్టీఆర్ ను తలపించేలా చేస్తున్నప్పుడు వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది.ఈసారి యాక్షన్ సన్నివేశాల్లో కూడా తన సత్తా చాటాడు. అతను డూప్ లేకుండా ఈ సినిమాలో రిస్కీ షాట్లు చేసి గాయాలు పాలయ్యాడని.. చిత్ర బృందం చెబుతుంటే అవి కాస్త వెటకారం అనుకున్నాం.. కానీ సినిమా చూసాక అవి నిజమే అనే ఫీలింగ్ కలుగుతుంది.
గతంలో కంటే ఈసారి సంపూ సినిమాల్లో కాస్త ఎక్కువ మంది సీనియర్ నటీనటులే కనిపించారు. షియాజీ షిండే, 30 ఇయర్స్ పృథ్వి, దివంగత కత్తి మహేష్, నాగినీడు, సమీర్, షఫీ, కరాటే కళ్యాణి, జయలలిత వంటి వారు ఈ మూవీలో నటించారు.అయితే షియాజీ షిండే,నాగినీడు పాత్రలు తప్ప మిగిలినవి గుర్తుండవు. ఇక షియాజీ షిండే,నాగినీడు పాత్రలు బాగానే ఉన్నా.. వాళ్ళ రేంజ్ కు తగ్గ మూవీ ఇది కాదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తారు.
సాంకేతికవర్గం పనితీరు: ఈ విభాగంలో హైలెట్స్ గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా నిర్మాణ విలువలు గురించి చెప్పుకోవాలి.ఇది స్పూఫ్ కామెడీ అనే ఫీలింగ్ కలగనివ్వకుండా ఖర్చుపెట్టారేమో అనిపిస్తుంది.కాబట్టి నిర్మాత సంధిరెడ్డి శ్రీనివాసరావు గారిని మెచ్చుకోవాల్సిందే. దర్శకుడు వసంత నాగేశ్వరరావు పనితనం విషయానికి వస్తే.. అతను ఎంచుకున్న కథ దగ్గరనుండీ సినిమాలో వచ్చే అన్ని సన్నివేశాలు రొటీన్ గానే అనిపిస్తాయి.
స్పూఫ్ సినిమానే కదా కొత్త సీన్లు ఏముంటాయి అనే అనుమానం కలగొచ్చు.. కనీసం వాటిని ఎంగేజింగ్ గా సంపూ నుండీ ఆశించే ఫన్ తో నడిపించి ఉంటే బాగుండేది.సంపూ గత సినిమాల్లో కనిపించిన ఫన్ ఇందులో మిస్ అయ్యింది. బలవంతంగా నవ్వాలి అన్నట్టు కామెడీ ఉంటుంది.సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సిల్లీగా అనిపిస్తుంది. ఎడిటింగ్ లోపాలు కూడా చాలానే ఉన్నాయి.
విశ్లేషణ: ఏదో ఒక సినిమా చూడకపోతే వీకెండ్ గడవదు అని ఫీలయ్యి థియేటర్ కు వెళ్లిన వాళ్ళను సైతం ‘బజార్ రౌడీ’ నిరాశపరుస్తాడు. సంపూర్ణేష్ బాబు కోసం ఈ మూవీ చూడాలి అనుకుంటే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే చాలా బెటర్. లేదంటే ఓటిటిలో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే ఇంకా బెటర్.